టీమ్‌ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. నిరంతరం మెలకువలు నేర్చుకుంటూ ఏటా తన బ్యాటింగ్‌ను మరింత మెరుగు పర్చుకున్నాడని పేర్కొన్నాడు. విజయం కోసం అతడు పడే తపన అద్భుతమని వెల్లడించాడు. విరాట్‌పై ఐసీసీ ఒక వీడియో రూపొందించింది. రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, మాక్స్‌వెల్, రవిశాస్త్రితో మాట్లాడించింది.
'విరాట్ కోహ్లీ విజయ దాహం నమ్మశక్యం కానిది. ప్రతిసారీ నిలకడగా వెళ్లి రాణించడం అంత సులభం కాదు. కానీ అతడు దానిని సునాయసంగా చేసేశాడు. 2008లో జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ప్రపంచంలోనే గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడు. ఏటా తన క్రికెట్ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు సాగాడు. అతడు జట్టును అత్యుత్తమంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించడం చూశాను' అని రోహిత్ అన్నాడు.
పదమూడేళ్ల తన క్రికెట్ ప్రయాణం నమ్మశక్యం కాకుండా ఉందని విరాట్ కోహ్లీ తెలిపాడు. భారత క్రికెటర్‌గా ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టీమ్‌ఇండియాకు విజయం అందించడంపైనే తానిప్పుడు దృష్టి పెడుతున్నానని వెల్లడించాడు.
'ఎప్పుడూ మాటలపైనే దృష్టి పెడితే అద్భుతాలు జరగవు. ఇన్నాళ్ల నా ప్రయాణం చూస్తుంటే ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనిపించలేదు. నా ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన సందర్భాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. నాకైతే అవే ప్రత్యేకం. ఇక ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టును గెలిపించడమే నా ప్రధాన లక్ష్యం. నేనిక నిలకడగా ఆ పని చేస్తాను. నా కెరీర్‌ను చూసి నేనెంతో సంతోషిస్తున్నాను' అని విరాట్ పేర్కొన్నాడు.
ఏ ఫార్మాట్‌ను ఎలా ఆడాలో అలాగే ఆడటం విరాట్ కోహ్లీ విజయానికి కారణమని రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. 'అతడో అద్భుతమైన బ్యాటర్. సాధారణ క్రికెటింగ్ షాట్లే ఆడతాడు. టీ20 క్రికెట్‌ను అతడిలా పద్ధతిగా ఆడేవాళ్లు మరెవ్వరూ ఉండరు. ఎలా ఆడాలో అలాగే ఆడతాడు. టెస్టులు, వన్డేల్లోనూ అంతే. అన్ని ఫార్మాట్లలోనూ ఒకేలా షాట్లు ఆడతాడు కాబట్టి అతడిలో ఎక్కువ మార్పేమీ రాలేదు' అని యాష్ అన్నాడు.
Also Read: Khel Ratna Award 2021: ఈసారి 12 మందికి ఖేల్‌రత్న.. ఒలింపియన్లకు గౌరవం.. జాబితాలో మిథాలీ, ఛెత్రీ