Sunil Chhetri's final game ends in 0-0 draw: భారత ఫుట్‌బాల్ చరిత్రలోనే కాక అంతర్జాతీయ ఫుట్‌బాల్ చరిత్రలోనూ ఓ శకం ముగిసింది. భారత ఫుట్‌బాల్‌కు చిరునామాగా నిలిచి.. జట్టు సభ్యులకు పోరాటాన్ని నేర్పిన సునీల్ ఛెత్రి(Sunil Chhetri) శకం ముగిసింది. ఉబికి వస్తున్న కన్నీళ్ల మధ్య... కుటుంబ సభ్యులు.. వేలాదిమంది అభిమానుల మధ్య సునీల్ ఛెత్రి తన ఇరవై ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. రెండు దశాబ్దాలుగా ఎన్నో మ్యాచుల్లో భారత్‌కు విజయాలను అందించిన ఓ వీరుడి విజయ ప్రస్థానం ఇక ముగిసింది. సునీల్ ఛెత్రీ భారత్ తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాడు. కోల్‌కతాలో కువైట్(India vs Kuwait Match)తో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 క్వాలిఫయర్స్( FIFA WC Qualifier) మ్యాచ్‌లో బరిలోకి దిగి ఛెత్రి చివరి మ్యాచ్ ఆడేశాడు. కువైట్‌తో జరిగిన ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగి డ్రా అయింది.
గార్డ్ ఆఫ్ హానర్
చివరి మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ సభ్యులు సునీల్ ఛెత్రికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు. సునీల్ ఛెత్రి చివరి మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కిక్కిరిసిన స్టేడియంలోని ప్రతీ అభిమాని లేచి నిలబడి ఛెత్రికి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ సమయంలో కోల్‌కత్తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో భావోద్వేగ వాతావరణ కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం సునీల్ ఛెత్రి కన్నీరు మున్నీరయ్యాడు. ఛెత్రీ మాత్రమే కాకుండా స్టేడియంలోనే ఉన్న ఛెత్రీ తల్లిదండ్రులు, భార్య కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. 68000 సామర్థ్యమున్న సాల్ట్ లేక్ స్టేడియంలో ఛెత్రి తన తల్లిదండ్రులు ఖర్గా-సుశీల, భార్య సోనమ్ భట్టాచార్య, పలువురు అధికారులు, మాజీ ఆటగాళ్ల మధ్య అంతర్జాతీయ కెరీర్‌కు ఉద్వేగభరితంగా వీడ్కోలు పలికారు. భారత ఫుట్‌బాల్ జట్టు తరపున 151వ మ్యాచ్ ఆడేసిన తర్వాత మైదానంలో సునీల్, సునీల్ అనే నినాదాలు ప్రతిధ్వనిస్తుండగా, ముకుళిత హస్తాలతో నమస్కరిస్తూ సునీల్ ఛెత్రీ మైదానాన్ని వీడాడు. అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికినా మరో రెండేళ్లపాటు సునీల్ ఛెత్రీని మైదానంలో చూడవచ్చు. వచ్చే ఏడాది ఇండియన్ సూపర్ లీగ్ జట్టు తరపున ఆడేందుకు ఛెత్రీ ఒప్పందం చేసుకున్నాడు.
మీ వల్లే ఇదంతా: ఛెత్రీ
తన 19 ఏళ్ల అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్‌లో సహకరించిన వారందరికీ ఛెత్రీ ధన్యవాదాలు తెలిపాడు. టీవీల్లో చూసి నన్ను అభిమానించిన వారు... మైదానంలో నాకు మద్దతుగా నిలిచిన వారు... ఆటోగ్రాఫ్‌లు తీసుకున్న వారు, ఎప్పటినుంచో అండగా నిలిచినవారు అందరికీ ధన్యావాదాలు అని ఛెత్రీ తెలిపారు. మీరందరూ లేకుండా ఈ 19 ఏళ్ల ప్రయాణం సాధ్యం కాదని... సునీల్ ఛెత్రి భావోద్వేగానికి గురయ్యాడు. మ్యాచ్ అనంతరం ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కూడా చెత్రీని సత్కరించింది.
రికార్డులకు మారుపేరు
పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (128), ఇరాన్ లెజెండ్ అలీ డేయ్ (108), అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (108) తర్వాత 39 ఏళ్ల ఛెత్రీ 94 గోల్స్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.