జీవితంలో క్రమశిక్షణ కోసం, ఆధ్యాత్మిక వృద్ధి ఆశించే వారు ధ్యాన సాధన చేస్తుంటారు. ఈరోజుల్లో చాలా మంది ఒత్తిడిని నివారించేందుకు, ప్రతీ ఆలోచన ఎరుకతో చేసుకోవాలనే ఉద్దేశ్యంతో మెడిటేషన్ చేస్తున్నారు. మైండ్ ఫుల్ మెడిటేషన్ తో మనసు, శరీరాల మధ్య ఒక సంతులన స్థితి ఏర్పడుతుంది. వేల సంవత్సరాలుగా ఒక ఆధ్యాత్మిక సాధనగా ధ్యానం ప్రాచూర్యంలో ఉంది. కానీ ఈరోజుల్లో చాలా మంది మానసిక స్థిరత్వం కోసం, ఒత్తిడిని జయించేందుకు ధ్యానాన్ని ఆశ్రయిస్తున్నారు. చాలా రకాల ధ్యాన పద్ధతులు ప్రాచూర్యంలో ఉన్నాయి. కొన్ని ధ్యానాలు మంత్రాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మరికొన్ని శ్వాస మీద ద్యాస పెట్టే టెక్నిక్‌‌లను అనుసరిస్తాయి.


ఏ పద్దతిలో చేసినా ధ్యానం మనసు శరీరం పనిచేసే అత్యంత ప్రాథమిక స్థితిని అర్థం చేసుకునేందుకు దోహదం చేస్తుంది. అయితే లక్ష్య సాధనలో ధ్యానం చాలా మంచి మార్గాలను సూచిస్తుంది. ధ్యానాన్ని క్రమం తప్పకుండా చేసే వారు బరువు తగ్గాలనుకుంటే తగ్గుతారని యోగా నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ధ్యాన సాధన శరీరం, ఆహార అలవాట్లను నిశితంగా గమనించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫలితంగా తినే ఆహారం మీద పూర్తిగా అదుపు ఉండడం వల్ల బరువు నియంత్రణలోకి వస్తుందని వీరి అభిప్రాయం.


ధ్యాన నియమాలు


ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం పది నిమిషాల పాటైనా ధ్యానం చెయ్యడం అవసరం. శ్వాస మీద ధ్యాస నిలపగలగడం శ్వాసతో పాటు శరీరంలో జరుగుతున్న కదలికలను గమనించడం అన్నింటికంటే సులభమైన ధ్యాన మార్గం. శ్వాస జరుగుతున్న తీరు, శ్వాస క్రియలో గాలి శబ్దాన్ని గమనించడం చెయ్యాలి. ఒక రెండు మూడు నిమిషాలు గడిచేసరికి ఇది మీకు సులభంగానే అలవడుతుంది. కళ్లు మూసుకుని లేదా తెరిచైనా ఫర్వాలేదు ఇక్కడ చెప్పిన స్టెప్స్ లో సాధన చేస్తూ పోవాలి.



  • దీర్ఘ శ్వాస తీసుకుని కొంత సమయం పాటు స్థంభించి ఉంచాలి. తర్వాత నెమ్మదిగా శ్వాస వదలాలి. ఇలా పది సార్లు చెయ్యలి.

  • నోరు కొద్దిగా తెరచి, పొట్ట కండరాలను విశ్రాంతి స్థితిలో ఉంచి నెమ్మదిగా ముక్కు నుంచి వచ్చే శ్వాస కదలికలను గమనించాలి. దీనిని కనీసం పది నిమిషాల పాటు చెయ్యాలి.

  • ఆలోచనలు రకరకాలుగా సాగడం చాలా సాధారణ విషయం. కేవలం వస్తున్నా ఆలోచనలను గమనిస్తుండాలి. తిరిగి మీ ధ్యాసను శ్వాస మీదకు మరల్చాలి.

  • ఇలా చేస్తూ ఉంటే త్వరలోనే మీ ఆలోచనల మీద మీకు తప్పకుండా ఒక అదుపు వస్తుంది. శ్వాస మీద తిరిగి ధ్యాస నిలపగలుగుతారు.


మెడిటేషన్‌తో బరువు తగ్గుతారు ఇలా


ధ్యానంతో బరువు అంత సులభంగా తగ్గడం సాధ్యపడదు. కానీ కొంత సాధనతో దీనిని సాధించడం అసాధ్యమేమీ కాదు. ధ్యానంతో కేవలం శారీరక లాభాలు మాత్రమే కాదు మానసిక స్థిరత్వం కూడా లభిస్తుంది. ఒత్తడిని జయించేందుకు ఇదొక చక్కని మార్గం. నిజానికి ఒత్తిడికి లోనయ్యే చాలా మందికి తాము తీసుకునే ఆహారం మీద అదుపు ఉండదు. ఫలితంగా బరువు పెరుగుతారు. ఒత్తిడిని నియంత్రించడం వల్ల పరోక్షంగా బరువు తగ్గేందుకు అవకాశాలు మెరుగుపడతాయి. ధ్యాన సాధనలో ఉన్నవారు ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయంలో తినడానికి ఉపక్రమించే ముందే గుర్తించడం సాధ్యపడుతుంది. అందువల్ల వెంటనే తినడం ఆపేస్తారు. భావోద్వేగాలు, శరీరంలో హార్మోన్ల సంతులనంలో ఉంటాయి. అందువల్ల కూడా బరువు నియంత్రణలోకి వస్తుంది. 


Also Read : ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగితే అంత ప్రమాదమా? తల్లీబిడ్డలకు వచ్చే సమస్యలివే!











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.