ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరగడం సహజమే. కానీ, దానివల్ల ఎన్నో సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. పోషకాలు తీసుకుంటూనే బరువును నియంత్రించుకోవడం ఎంతో ముఖ్యమని అంటున్నారు. లేకపోతే తల్లి, బిడ్డకు ప్రమాదమేనని హెచ్చరిస్తున్నారు.
ఈ మధ్య కాలంలో గర్భవతుల్లో ఇన్సులిన్ నిరోధకత ఎక్కువగా కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. అతిగా బరువు పెరగడం కూడా ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ గ్యాస్టెషనల్ డయాబెటిస్ తర్వాత కాలంలో తల్లికి టైప్2 డయాబెటిస్ గా పరిణమించవచ్చు. పరిమితికి మించి బరువు పెరిగినపుడు గర్భంలో ఉన్న పిండం కూడా ఎక్కువ బరువు కలిగి ఉండవచ్చు. ఈ సమస్యను మాక్రోసోమియా అంటారు. లేదా ప్రీఎక్లంప్సియా గా చెపుకునే తల్లికి బీపి పెరిగిపోయే సమస్య కూడా రావచ్చు. ఇవి రెండు సమస్యలు కూడా సుఖ ప్రసవానికి ఆస్కారం లేకుండా చేస్తాయి. తప్పనిసరిగా సీజేరియన్ డెలివరీకి వెళ్లాల్సి రావచ్చు. తల్లి ఊబకాయం బిడ్డ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది.
గ్యాస్టేషనల్ హైపర్ టెన్షన్
గర్భవతుల్లో పరిమితికి మించి బరువు పెరిగితే బీపీ పెరిగిపోవచ్చు. ఇది ప్రీకాంప్సియా మాత్రమే కాదు గుండె, రక్తనాళాలకు సంబంధించిన ప్రమాదకర పరిస్థితులకు కారణం కావచ్చు కూడా.
పోస్ట్ ప్యాట్రమ్ హెమరేజ్
గర్భధారణ సమయంలో స్థూలకాయం సమస్యతో ఉన్న మహిళల్లో ప్రసవం తర్వాత రక్తస్రావ ప్రమాదం ఎక్కువగా ఉండొచ్చు. ఈ సమస్యకు వెంటనే చికిత్స అందించకపోతే అది ప్రాణాంతకం కూడా కావచ్చు.
థ్రోంబోఎంబోలిజం
రక్తం గడ్డకట్టడం, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడడానికి అధిక శరీర బరువు కూడా ఒక కారణం. డీప్ వీన్ థ్రోంబోసిస్ వంటి సమస్యలు ఏర్పడితే.. పల్మనరీ ఎంబోలిజం వంటి తీవ్రమైన ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
గర్భవతుల్లో అధిక శరీర బరువు చాలా ప్రమాదకరం. చాలా సందర్భాల్లో ప్రసూతి సమయంలో తల్లి మరణానికి కారణం కావచ్చు. ఇలాంటి మరణాలను మెటర్నల్ మోర్టాలిటి అంటారు. అధ్యయనాలు ప్రసూతి మరణాలకు మొదటి కారణం గర్భవతుల్లో స్థూలకాయం అని చెబుతున్నాయి. ఇవన్నీ.. గర్భంతో ఉన్న తల్లి ఎదుర్కొనే సమస్యలు. అలాగే, ఆమె గర్భంలో ఉండే శిశువుపై కూడా స్థూలకాయం ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు.
పిల్లల్లో ఈ సమస్యలు తప్పవు
గర్భస్థ శిశువు కూడా పరిమితికి మించి బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీనిని మాక్రోసోమియా అని అంటారు. ఫలితంగా బిడ్డకు షోల్డర్ డిస్టోసియా లేదా బర్త్ ఇంజూరీస్ అయ్యే ప్రమాదం ఉంది. బరువు అధికంగా ఉన్న తల్లుల్లో ప్రసవంలో సమస్యలు ఏర్పడతాయి. మృత శిశువు జనానికి తల్లి స్థూలకాయం కూడా కారణం కావచ్చు.
ప్రెగ్నెన్సీ సమయంలో బరువు పెరిగే తల్లులకు పుట్టిన పిల్లలు బాల్యం నుంచే ఊబకాయ సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అలాగే వారిలో టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్, జీవక్రియ సమస్యలు రావచ్చు.
Also Read : టాటూతో బ్లడ్ క్యాన్సర్ వస్తుందా? ఆ వయస్సు వారికి మరింత ప్రమాదకరమా? తాజా అధ్యయనాల్లో ఏం తేలిందంటే?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.