Lionel messi Jerseys Auction: ఫుట్ బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ (Lionel Messi) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. తన జెర్సీలను వేలం (Jersys Auction) వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. దీని ద్వారా వచ్చిన సొమ్ములో కొంత భాగాన్ని అరుదైన వ్యాధితో బాధ పడుతున్న చిన్నారుల చికిత్స కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపాడు. తన ఆటతో కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న మెస్సీ, గతేడాది ఖతర్ గడ్డపై అర్జెంటీనాను (Argentina) విశ్వ విజేతగా నిలిపి, తన వరల్డ్ కప్ కలను నిజం చేసుకున్నాడు. ఈ క్రమంలో తాను ధరించిన 10వ నెంబర్ జెర్సీలను వేలం వేస్తున్నట్లు పోస్ట్ చేశాడు. మెస్సీ ఈ మధ్యే ఎనిమిదోసారి 'బాలన్ డీ ఓర్' అవార్డును అందుకున్నాడు.


6 జెర్సీలకు రూ.76 కోట్లు


అర్జెంటీనాకు చెందిన సోత్ బైస్ కంపెనీ లియోనల్ మెస్సీ జెర్సీలను వేలం వేయనుంది. ఫ్రాన్స్ తో జరిగిన ఫైనల్లో ధరించిన జెర్సీతో కలిపి మొత్తం 6 జెర్సీలకు రూ.76 కోట్ల కనీస ధరగా నిర్ణయించింది. వీటికి క్రీడా చరిత్రలోనే భారీ ధర పలకొచ్చని సోత్ బైస్ కంపెనీ చెబుతోంది. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని సాంట్ జాన్ డె డూ బార్సెలోనా పిల్లల దవాఖాన నిర్వహిస్తోన్న యునికాస్ ప్రాజెక్టుకు మెస్సీ విరాళంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


నెరవేరిన కల


గతేడాది ఖతర్ లోని లూసెయిల్ స్టేడియంలో జరిగిన ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా షూటౌట్ లో 4-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. మెస్సీ 2 గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో, 36 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అర్జెంటీనా ప్ర‌పంచ ఛాంపియ‌న్‌గా అవ‌త‌రించింది. 35 ఏళ్ల మెస్సీ వ‌ర‌ల్డ్ క‌ప్ క‌ల కూడా ఈ విజయంతో నెర‌వేరింది. ఈ క్రమంలో మెస్సీ సంబరాలు అంబరాన్నంటాయి. వరల్డ్ కప్ గెలిచిన అనంతరం టీం రూంలో మెస్సీ ఉత్సాహంగా టేబుల్ ఎక్కి డ్యాన్స్ చేశాడు. ప్రపంచ కప్ అనంతరం పీఎస్ జీ క్లబ్ ను వీడిని మెస్సీ అమెరికాకు చెందిన ఇంట‌ర్ మియామి క్ల‌బ్‌తో ఒప్పందం చేసుకున్నాడు.


Also Read: SSC Constable: 'టెన్త్' అర్హతతో కేంద్రంలో కానిస్టేబుల్ కొలువులు - 75,768 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల