Telangana Elections 2023: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఏడాది ప్రథమార్థంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. ఈ నెలాఖరున తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. జనాలను ఆకర్షించడానికి జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రకరకాల హామీలతో మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల మూడ్ ని టాలీవుడ్ ఫిలిం మేకర్స్ తమ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.


సాధారణంగా ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు తమ పార్టీల ప్రచారం కోసం సినీ సెలబ్రిటీలను ఉపయోగించుకోవడం మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు హీరో న్యాచురల్ స్టార్ నాని మాత్రం డిసెంబర్ 7న విడుదల కాబోతున్న తన 'హాయ్ నాన్న' సినిమా ప్రచారం కోసం ఏకంగా ఎన్నికలను వాడేస్తున్నాడు. ఇటీవల పొలిటీషియన్ గెటప్ లో వచ్చిన నాని.. తన సినిమా పేరునే పార్టీగా ప్రకటించి, తనని అధ్యక్షుడిగా పరిచయం చేసుకున్నాడు. ఎలక్షన్స్ మధ్యలో వున్నాయి కాబట్టి వాడేయటమే అంటూ మ్యానిఫెస్టో పేరుతో ఓ వీడియోని కూడా వదిలాడు. ఆ ఇద్దరూ రాలేదా అంటూ నారా లోకేష్ ప్రెస్ మీట్ ను గుర్తు చేశారు.


థియేటర్ల ఆదాయం, ఆ పక్కనే ఉన్న కిరాణా కొట్టోళ్ళ ఆదాయం కూడా పెరిగేలా చూస్తాం అంటూ గతంలోని వివాదాన్ని మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు నాని. 'హాయ్ నాన్న' అనేది తండ్రీ కూతుర్ల రిలేషన్ షిప్ నేపథ్యమున్న సినిమా కాబట్టి ప్రతీ తండ్రికి కుమార్తెకు రెండు ఓట్లు ఉండేలా చూస్తానని, 18 ఏళ్ళు నిండిన వాళ్లే కాకుండా ప్రతీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఫన్నీ హామీ ఇచ్చారు. ఓట్ల కోసం పొలిటీషియన్స్ ఎన్నో కబుర్లు చెప్తారని, యాక్టర్స్ కూడా తమ సినిమానే చూడాలని ఎన్నెన్నో చెప్తారని, కానీ అందరూ అలోచించి మంచోడికే ఓటు వెయ్యాలని, మంచి సినిమానే థియేటర్లలో చూడాలని సూచించారు నాని.


Also Read: 'లియో' యాక్టర్​పై ఫైర్ అయిన త్రిష.. సపోర్ట్​గా నిలిచిన డైరెక్టర్!


'ఊరికే ప్రెస్ మీట్ పెట్టా' అంటూ లేటెస్టుగా మరో వీడియోతో వచ్చాడు నాని. 'ఏం రాహుల్' అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇమిటేట్ చేసారు. రివ్యూల గురించి వాయిస్ ఓవర్ లో ప్రశ్నించగా, ''మనిషికో లక్ష ఇద్దామంటావా? ఏందివయ్యా రాహుల్.. సినిమా బాగుంటే ఆడతది, లేకుంటే పీకుతది" అంటూ నాని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా 'రివ్యూలపై మండిపడ్డ హాయ్ నాన్న ప్రెసిడెంట్ విరాజ్' అనే స్క్రోలింగ్ వేయడాన్ని గమనించవచ్చు. నాని ఈ విధంగా ఎన్నికల మూడ్ ని వాడుకొని డిఫరెంట్ గా తన సినిమాని ప్రమోట్ చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






నాని 'హాయ్ నాన్న' బాటలోనే 'కోట బొమ్మాళి PS' టీమ్ కూడా ఎన్నికల వాతావరణాన్ని తమ సినిమా ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. రాజకీయ నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వ్యవస్థలను ఎలా మ్యానేజ్ చేస్తారు? పోలీసులను ఎలా బలిపశువులను చేస్తారు? అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగానే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపించడం చిత్ర బృందానికి కలిసొచ్చింది. ఇప్పటికే ప్రచార సభ పేరుతో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.


ఈ పొలిటికల్ సీజన్‌ కోసం 'కోట బొమ్మాళి PS' మ్యానిఫెస్టో అంటూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ అంశాల గురించి వివరిస్తూ ఓ వీడియోని వదిలారు. టికెట్ టూ శ్రీకాకుళం, థ్రిల్స్ గ్యారంటీ స్కీమ్, అందరికీ టీ పథకం, థియేటర్లలో డ్యాన్స్ చేసే పథకం అంటూ రాహుల్ విజయ్ - శివానీ రాజశేఖర్ లు స్కీమ్స్ ప్రకటించారు. నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న తమ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలని కోరారు.






ఇలా 'హాయ్ నాన్న', 'కోటబొమ్మాళి' చిత్ర బృందాలు కాస్త డిఫరెంట్ రూట్ లో ప్రచారం చేస్తున్నారు. మధ్యలో ఎన్నికలు ఉండటంతో ఆ మూడ్ ని తమ సినిమాల ప్రమోషన్ కోసం వాడుకుంటున్నారు. నిజానికి ఈరోజుల్లో ఎంత మంచి సినిమా తీసినా దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి కొత్తగా ఏదైనా చేయాల్సి చేయాల్సి వస్తోంది. మరి ఈ డిఫెరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీ సినిమాకి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి.


Also Read: 2023 లో కనిపించని స్టార్ హీరోలు, వచ్చే ఏడాది మాత్రం తగ్గేదేలే!