శుభ్ మన్ గిల్ అరంగేట్రంలోనే అతని బ్యాటింగ్ స్టయిల్ చూసి ఈ కుర్రాడు మున్ముందు భారత బ్యాటింగ్ ఆర్డర్ లో కీలకంగా మారతాడని క్రికెట్ పండితులు విశ్లేషించారు. వారన్నట్లే టెస్టుల్లో తనేంటో ఇప్పటికే నిరూపించుకున్నాడు. ఇప్పుడు జింబాబ్వే పర్యటనలో వన్డేల్లో  అదుర్స్ అనిపించే ప్రదర్శన చేశాడు.  కెరీర్ లో తొలి సెంచరీ సహా మూడు వన్డేల్లో 245 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్నాడు. మూడో వన్డేలో మ్యాచ్ విన్నింగ్ క్యాచ్ పట్టి ఫీల్డింగ్ లోనూ సత్తా చాటాడు. మరి అతడి ప్రదర్శన ఎవరికైనా ఎసరు తేనుందా!!


గిల్ బలాలు


సమయోచితంగా ఆడడం గిల్ కున్న అతి పెద్ద బలం. మొదట నిదానంగా మొదలుపెట్టి అవసరమైనప్పుడు బ్యాట్ ఝుళిపించగలడు. అలాగే డాట్ బాల్స్ పర్సంటేజీ తగ్గించుకున్నాడు. హిట్టింగ్ కాకుండా టైమింగ్ తో షాట్లు కొడతాడు. 


శుభ్ మన్ కెరీర్


31 జనవరి 2019లో  న్యూజిలాండ్ తో మ్యాచ్ తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు గిల్. జింబాబ్వే పర్యటనకు ముందు వరకు పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఈ బ్యాటర్ అంతగా రాణించలేదు. అయితే ఈ సిరీస్ లో విశేషంగా రాణించి జట్టులో ఓపెనర్ స్థానానికి పోటీగా మారాడు. 


ఓపెనర్ స్థానానికి పోటీ


పరిమిత ఓవర్ల క్రికెట్ లో టీమిండియాకు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లు రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్నారు. వీరు ఫిట్ గా ఉండి జట్టులో ఉంటే వేరే ప్రత్యామ్నాయం కోసం చూడనవసరం లేదు. అయితే వీరి తర్వాత ఓపెనర్లు ఎవరు అంటే ముగ్గురు పేర్లు వినిపిస్తాయి. ధావన్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్. ఇప్పుడు గిల్ రాణించటంతో పోటీ మరింత పెరిగింది. 


ధావన్, ఇషాన్ ఎడమచేతి వాటం బ్యాటర్లు. ఓపెనింగ్ కోసం కుడి, ఎడమ బ్యాటర్లు కావాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి చోటు దక్కుతుంది. అలా కాకుండా ఇద్దరు కుడి చేతి వాటం బ్యాటర్లు అయితే వీరి ముగ్గురికి గిల్ పోటీగా మారతాడనడంలో సందేహం లేదు. టీ20ల్లో చిచ్చర పిడుగులా ఆడే ఇషాన్ కిషన్.. ఇప్పటివరకు 6 వన్డేలు ఆడినా పెద్దగా రాణించలేదు. ఇక రుతురాజ్ వన్డేల్లో ఇంకా అరంగేట్రమే చేయలేదు. ధావన్ విషయానికి వస్తే అతని వయసు, ఫామ్ ను బట్టి జట్టులో చోటు ఉంటుంది. కాబట్టి గిల్ రాబోయే సిరీసుల్లోనూ ఈ విధంగా రాణిస్తే ఓపెనర్ స్థానాన్ని నిలబెట్టుకోవచ్చు.