Rafeal Nadal withdrawas from 2022 Wimbledon :స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌ (Rafeal Nadal) అభిమానులకు బ్యాడ్‌న్యూస్‌! 22 గ్రాండ్‌స్లామ్‌ల విజేత రఫా వింబుల్డన్‌ టోర్నీ (Wimbledon) నుంచి తప్పుకున్నాడు. గాయంతో అతడీ నిర్ణయం తీసుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా ఆటగాడు నిక్‌ కిర్గియోజ్‌ (Nick Kyrgios) తొలిసారి ఒక మేజర్‌ టోర్నీ ఫైనల్‌ చేరుకున్నాడు.


ఆదివారం జరిగే ఫైనల్‌ చేరుకోవాలని రఫెల్‌ నాదల్‌ భావించాడు. శుక్రవారం నిక్‌ కిర్గియోస్‌తో సెమీస్‌లో తలపడాల్సి ఉంది. అయితే కడుపు కండరాల్లో చిన్న చీలిక రావడంతో నొప్పితో ఇబ్బంది పడుతున్నాడు. గాయం మరింత తీవ్రం కాకుండా ముందు జాగ్రత్తగా టోర్నీ నుంచి తప్పుకున్నాడు.


'నేనీ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను. పొట్ట దగ్గర నొప్పితో బుధవారం నేను విలవిల్లాడటం ప్రతి ఒక్కరూ చూశారు. వైద్యులు దానిని ధ్రువీకరించారు. కడరంలో చిన్న చీలిక వచ్చింది' అని ఆల్‌ ఇంగ్లాండ్‌ కబ్ల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో రఫా మీడియాకు వివరించాడు. 'నేనిప్పుడు ఆడటం అంత మంచిది కాదు. గాయం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది' అని పేర్కొన్నాడు.






రఫా తప్పుకోవడంతో వింబుల్డన్‌ నిర్వాహకులు సైతం ట్వీట్‌ చేశారు. 'రఫెల్‌ నాదల్‌ ఇలా ముగించడం బాధాకరం. వింబుల్డన్‌లో మరో ఏడాది మర్చిపోలేని మధుర స్మృతులు అందించినందుకు ధన్యవాదాలు' అని పోస్ట్‌ చేశారు.


Also Read: టీ20ల్లో ఈ రికార్డు సృష్టించిన మొదటి కెప్టెన్‌ రోహిత్‌ శర్మే!


వారం రోజులుగా నాదల్‌ కడుపు కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో అది మరింత తీవ్రంగా మారింది. టేలర్‌ ఫ్రిడ్జ్‌తో జరిగిన నాలుగున్నర గంటల పోరులో అతడు నొప్పితో విలవిల్లాడాడు. ఆట మధ్యలోనే తప్పుకోవడం గురించి ఆలోచించానని మ్యాచ్‌ ముగిశాక నాదల్‌ చెప్పాడు. మధ్యమధ్యలో మెడికల్‌ టైమ్‌ఔట్స్‌ తీసుకున్నాడు. పలుసార్లు నొప్పి నివారణ మాత్రలు వేసుకున్నాడు. మ్యాచ్‌ నుంచి తప్పుకోవాలని అతడి సోదరి, తండ్రి సైతం స్టాండ్స్‌ నుంచి చాలాసార్లు సూచించారు.