Rohit Sharma Records: టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. కెప్టెన్‌గా వరుసగా 13 టీ20 విజయాలు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. సౌథాంప్టన్‌ వేదికగా గురువారం రాత్రి ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 199 పరుగుల టార్గెట్‌ను ఆంగ్లేయులు ఛేదించలేకపోయారు. 148కే ఆలౌటయ్యారు.


రోహిత్‌ శర్మ ఇప్పటి వరకు 29 మ్యాచులకు సారథ్యం వహించాడు. అందులో 25 గెలిస్తే కేవలం 4 మ్యాచుల్లోనే ఓటమి ఎదురైంది. విజయాల శాతం 90 వరకు ఉంది. గతంలో విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినప్పుడు జట్టును హిట్‌మ్యానే నడిపించేవాడు. బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆసియా కప్‌లో భారత్‌ను గెలిపించాడు. ఇప్పుడు వరుసగా 13 విజయాలతో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అందుకే మ్యాచ్‌ ముగిసిన వెంటనే 'అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా 13 మ్యాచులు గెలిచిన కెప్టెన్‌' అంటూ రోహిత్ శర్మపై బీసీసీఐ ట్వీట్‌ చేసింది.


ఇంగ్లాండ్‌పై గెలిచినందుకు రోహిత్‌ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. తొలి బంతి నుంచే అదరగొట్టామని పేర్కొన్నాడు. బ్యాటర్లంతా తమ కసిని ప్రదర్శించారని అభినందించాడు. పిచ్‌ చాలా బాగున్నా చెత్త షాట్లు అస్సలు ఆడలేదని గుర్తు చేశాడు. పవర్‌ప్లేను సద్వినియోగం చేసుకున్నామని వివరించాడు. దూకుడుగా ఆడే క్రమంలో కొన్ని సార్లు వైఫల్యాలు ఎదురవుతుంటాయని చెప్పాడు. హార్దిక్‌ బౌలింగ్‌ ఆకట్టుకుందన్నాడు. భవిష్యత్తులోనూ అతడు ఇలాంటి ప్రదర్శనలే చేయాలని కోరుకున్నాడు. అతడి బ్యాటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదన్నాడు. కొత్త బంతి బౌలర్లు చక్కగా స్వింగ్‌ చేశారని ప్రశంసించాడు. మైదానంలో ఫీల్డింగ్‌ మరింత మెరుగవ్వాలని, క్యాచులు అందిపుచ్చుకోవాలని రోహిత్‌ పేర్కొన్నాడు.




మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌పై టీమిండియా 50 పరుగులతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 19.3 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది.


టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఎలా సాగిందంటే


టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఉన్నంత సేపు వేగంగా ఆడిన రోహిత్ శర్మను (24: 14 బంతుల్లో, ఐదు ఫోర్లు) మొయిన్ అలీ అవుట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (8: 10 బంతుల్లో) కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన దీపక్ హుడా (33: 17 బంతుల్లో, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (39: 19 బంతుల్లో, నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా రాణించారు.


అయితే వీరు ముగ్గురూ అవుటయ్యాక స్కోరు వేగం పూర్తిగా మందగించింది. దినేష్ కార్తీక్ (11: 7 బంతుల్లో, రెండు ఫోర్లు) విఫలం కావడంతో పాటు చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులకు పరిమితం అయింది. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ రెండు వికెట్లు తీసుకోగా... రీస్ టాప్లే, టైమల్ మిల్స్, మాథ్యూ పార్కిన్సన్‌లకు చెరో వికెట్ దక్కింది.