World Unites To Say Goodbye To Sunil Chhetri: అంతర్జాతీయ ఫుట్‌బాల్(International Foor Ball)కు వీడ్కోలు పలికిన దిగ్గజ ఆటగాడు సునీల్ ఛెత్రీ(Sunil Chhetri)కి క్రీడా దిగ్గజాలు, పలువురు ప్రముఖులు భావోద్యేగానికి గురయ్యారు. భారత్‌లో పుట్‌బాల్ అభివృద్ధికి సునీల్ ఛెత్రీ చేసిన సేవలను స్మరించుకున్నారు. ఛెత్రీ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... ఫుట్‌బాల్‌కు కొన్ని దశాబ్దాల పాటు ఛెత్రీ చిరునామాగా మారారని అన్నారు. గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఫిపా, క్రొయేషియా గ్రేట్ లూకా మోడ్రిక్, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఛెత్రీ వీడ్కోలుపై స్పందించారు. 39 ఏళ్ల సునీల్ ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్‌లో 151 మ్యాచ్‌లు ఆడి 94 గోల్స్‌తో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. పోర్చుగల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (128), ఇరాన్ లెజెండ్ అలీ డేయ్ (108), అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (108) తర్వాత ఛెత్రీ 94 గోల్స్‌తో నాలుగో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
దిగ్గజానికి శుభాకాంక్షల వెల్లువ
19 ఏళ్ల పాటు అంతర్జాతీయ కెరీర్‌లో కొనసాగిన సునీల్ ఛెత్రీకి శుభాకాంలంటూ ఫిఫా ట్వీట్ చేసింది. కువైట్‌తో మ్యాచ్ ముగిసిన వెంటనే ఫిఫా ఈ ట్వీట్ చేసింది. 94 అంతర్జాతీయ గోల్స్ చేసి.. ఒక దేశం ఆశలను ముందుకు తీసుకెళ్లిన ఆసియా ఫుట్‌బాల్ ఐకాన్, సునీల్ ఛెత్రికి ధన్యవాదాలంటూ ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య (AFC) ట్వీట్ చేసింది. ఛెత్రీని అద్భుతమైన కెరీర్‌కు అభినందిస్తూ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఏ లక్ష్యాన్ని సాధించడం సులభం కాదని.... 94 అంతర్జాతీయ గోల్స్‌తో భారత కీర్తిపతాకను ఛెత్రీ ఎగరవేశారని సచిన్ ట్వీట్ చేశారు. ఈ అద్భుతమైన కెరీర్‌ను దేశానికి అందించినందుకు సునీల్ ఛెత్రికి సచిన్ ధన్యవాదాలు తెలిపాడు.
ఛెత్రీ లేని లోటును భారత ఫుట్‌బాల్‌లో భర్తీ చేయలేమని ప్రీమియర్ లీగ్ ఇండియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారత మాజీ హాకీ కెప్టెన్ విరెన్ రస్కిన్హా కూడా ఛెత్రీ అద్భుతమైన కెరీర్‌ను ప్రశంసించాడు. సునీల్ ఛెత్రీని ఓ దిగ్గజ ఆటగాడని... మైదానంలో చిరుతలా కదిలి భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని రస్కిన్హా ట్వీట్ చేశాడు. ఛెత్రీ వీడ్కోలు తర్వాత తాను భారతీయ ఫుట్‌బాల్ గురించి నిజంగా ఆందోళన చెందుతున్నానని.. ఛెత్రీలేని మ్యాచ్‌లు చూడడం చాలా బాధాకరమని... అన్నారు. అర్జున్ కపూర్ , అభిషేక్ బచ్చన్ మొదలగు సినిమా తారలు కూడా ఛెత్రీకి అభినందనలు తెలిపారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంచైజీలన్నీ కూడా ఛెత్రీ కెరీర్‌కు వీడ్కోలు పలకడంపై ప్రత్యేక ట్వీట్ చేశాయి. ఛెత్రీని ఇండియన్ ఫుట్‌బాల్ రారాజుగా కీర్తించాయి. క్రొయేషియా కెప్టెన్, రియల్ మాడ్రిడ్ సూపర్‌స్టార్ మోడ్రిచ్ కూడా ఛెత్రీని ప్రశంసించాడు. ఛెత్రీని మోడ్రిచ్ గేమ్ ఆఫ్ ది లెజెండ్ అని కొనియాడాడు. అద్భుతమైన కెరీర్‌కు వీడ్కోలు పలికిన ఛెత్రీకి అభినందనలు తెలిపిన మోడ్రిచ్... భారత్ ఫుట్‌బాల్ చరిత్రలో సునీల్ ప్రయాణం అనితర సాధ్యమని 2018 బాలన్ డి'ఓర్ విజేతగా నిలిచిన మోడ్రిక్ అన్నారు.
ఎన్నో విజయాలు
సునీల్ ఛెత్రీ నేతృత్వంలోని భారత జట్టు 2007, 2009, 2012లో నెహ్రూ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. 2011, 2015, 2021, 2023 SAFF ఛాంపియన్‌షిప్‌లను భారత్ గెలుచుకుంది. ఛెత్రి 2008 AFC ఛాలెంజ్ కప్‌లో ఫైనల్‌లో హ్యాట్రిక్‌తో భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఛెత్రీ హ్యాట్రిక్ గోల్స్‌తో 27 సంవత్సరాల తర్వాత భారత్ మొదటి AFC ఆసియా కప్‌కు అర్హత సాధించింది.