టీమ్‌ఇండియా మిలార్డర్ ఇబ్బందులను రవీంద్ర జడేజా పరిష్కరించగలడని వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అంటున్నాడు. అతడిలో బాధ్యత మరింత పెరిగిందని పేర్కొన్నాడు. బాధ్యత లేకుండా ఆడేందుకు అతడేమీ చిన్నపిల్లాడు కాదని వెల్లడించాడు.
'జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అతడినిప్పుడు చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఐదో స్థానానికీ అతడు నప్పుతాడు. ఆడేటప్పుడు తెలివిని ఉపయోగిస్తున్నాడు. అతడెంత మాత్రం బాధ్యతారాహిత్యంగా ఆడే చిన్నపిల్లాడు కాదు' అని డీకే అంటున్నాడు.
కాలం గడిచే కొద్దీ జడ్డూ మరింత మెరుగ్గా ఆడుతున్నాడని డీకే తెలిపాడు. అన్ని ఫార్మాట్లలో ఆల్‌రౌండర్‌గా అదరగొడుతున్నాడని పేర్కొన్నాడు. 'అతడు బ్యాటుతో మ్యాచులు గెలిపించే వీరుడిగా ఎదిగాడు. నిజం చెప్పాలంటే అతడి బ్యాటింగే అతడి బలం' అని డీకే వెల్లడించాడు.
ఎప్పటిలాగే టీమ్‌ఇండియా మిడిలార్డర్ కష్టాలు వేధిస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీసులో ఈ విషయం మరోసారి బయటపడింది. ఓపెనర్ల తర్వాత మరెవ్వరూ ఆడలేకపోయారు. మ్యాచులను గెలిపించే ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఆల్‌రౌండర్ల కొరత జట్టును వేధిస్తోందని కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం అంగీకరించారు. హార్దిక్ పాండ్య తర్వాత జట్టుకు సమతూకం తీసుకొచ్చేవారు కనిపించడం లేదని పేర్కొన్నారు. అందుకే జడ్డూ బెస్టని డీకే అభిప్రాయం.
ప్రస్తుతం జడ్డూ మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఫిట్‌నెస్ ఇబ్బందులు ఉండటంతోనే అతడిని దక్షిణాఫ్రికా సిరీసుకు ఎంపిక చేయలేదు. కోలుకోవడంలో ఆఖరి దశలో ఉండటంతో వెస్టిండీస్ సిరీసుకూ ఎంపిక చేయలేదు. అతనెప్పుడొస్తాడా అని జట్టు యాజమాన్యం ఎదురు చూస్తోంది.
Also Read: Ravi shastri on Virat Kohli: విరాట్ 3 నెలలు విరామం తీసుకుంటే చాలు.. సెంచరీల వరదే!
Also Read: IND vs WI: అనిల్ సర్ పాఠాలతోనే ఎదిగానన్న రవి బిష్ణోయ్! విండీస్‌తో తలపడే టీ20, వన్డే జట్లివే