Ravindra Jadeja Century: టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అద్భుతం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో అద్వితీయ శతకం బాదేశాడు. తనలోని అసలు సిసలైన బ్యాటర్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు. రెండో రోజు ఆట మొదలైన పావుగంటకే సెంచరీ అందుకున్నాడు. 83 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోరుతో క్రీజులోకి వచ్చిన అతడు చక్కని కవర్‌డ్రైవ్‌లతో అలరించాడు. మ్యాటీ పాట్స్‌ వేసిన 78.5వ బంతికి అతడి జీవనదానం లభించింది. స్లిప్‌లో క్రాలీ క్యాచ్‌ వదిలేయడంతో అది బౌండరీకి వెళ్లింది. ఆ తర్వాత బంతినీ బౌండరీకి పంపించి టెస్టుల్లో మూడో సెంచరీ అందుకున్నాడు. మొత్తంగా 183 బంతుల్లో 13 ఫోర్లతో ఈ ఘనత సాధించాడు. అయితే అండర్సన్‌ వేసిన 82.2వ బంతికి అతడు ఔటయ్యాడు.


Also Read: జస్ట్‌ 6.14 నిమిషాల్లో రిషభ్‌ పంత్‌ ఊచకోత - వైరల్‌ వీడియో!


జడ్డూ సెంచరీతో కొన్ని రికార్డులూ బద్దలయ్యాయి. ఒక క్యాలండర్‌ ఇయర్‌లో ఏడో స్థానం లేదా ఆ తర్వాత వచ్చి రెండు సెంచరీలు చేసిన నాలుగో భారతీయుడిగా అతడు నిలిచాడు. 1986 కపిల్‌దేవ్‌, 2009లో ఎంఎస్‌ ధోనీ, 2010లో హర్భజన్‌ సింగ్‌ ఇలా చేశారు. టీమ్‌ఇండియా తరఫున ఇద్దరు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేయడం ఇది మూడో సారి. 1999లో అహ్మదాబాలో న్యూజిలాండ్‌పై శఠగోపన్‌ రమేశ్ (110), సౌరవ్‌ గంగూలీ (125); 2007లో బెంగళూరు వేదికగా పాక్‌పై గంగూలీ 239), యువరాజ్‌ (169); 2022లో ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌పై రిషభ్ పంత్‌ (146), జడ్డూ (104) చేశారు.