హైకోర్ట్ సంచలన తీర్పునిచ్చింది. లైంగిక దాడి కారణంగా గర్భందాల్చిన మైనర్‌కు 16 వారాల గర్భం తొలగించేందుకు అనుమతినిచ్చింది. నాగ్‌పూర్ బెంచ్ ఈ తీర్పుని వెలువరించింది. "ఆమె అలాగే గర్భంతో ఉండటం వల్ల శారీరకంగానే కాక, మానసికంగానూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది" అని స్పష్టం చేసింది. ఓ హత్య కేసులో అబ్జర్వేషన్‌ హోమ్‌లో కస్టడీలో ఉంది ఆ మైనర్. జస్టిస్ ఏఎస్ చందూర్కర్, జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. ఈ డివిజన్ బెంచ్ జూన్ 27న ఈ కేసుకు సంబంధించిన వాదనలు వినిపించారు. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ-MTP అనే అంశాన్ని ప్రస్తావించారు. సుప్రీం కోర్టు కూడా ఇందుకు సంబంధించి ఓ తీర్పునిచ్చిందంటూ గుర్తు చేశారు. "రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం,ఓ మహిళ తన గర్భాన్ని ఉంచుకోవాలా, తీసివేయాలా సొంతంగా నిర్ణయించుకునే హక్కు ఉంటుందని సుప్రీం కోర్టు గతంలోనే చెప్పింది" అని జస్టిస్‌లు తమ వాదన వినిపించారు. "పిల్లల్ని కనాలని ఆమెపై ఒత్తిడి చేయటం ఏ మాత్రం తగదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మహిళలకు ఉంటుందని" న్యాయమూర్తులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.



ఓ హత్య కేసులో అరెస్టైన మైనర్ ఎప్పటి నుంచో తన గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి అడుగుతోంది. అయితే విచారణలో భాగంగా తేలిందేంటంటే, లైంగిక దాడిలో ఆ మైనర్ గర్భం దాల్చింది. పిల్లల్ని కని పోషించే ఆర్థికస్థోమత తనకు లేదని, పైగా లైంగిక దాడి కారణంగా మానసికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నానని బాధితురాలు చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో బిడ్డని పోషించటం సాధ్యపడదని చెప్పటం వల్ల ఆమె తరపున న్యాయవాది ఇదే విషయాన్ని కోర్టుకి వివరించారు. ఈ వాదన విన్న న్యాయస్థానం, బాధితురాలి మెడికల్ రిపోర్ట్ అందించాలని ఆదేశించింది. 20 వారాల గర్భం తరవాత మెడికల్ రిపోర్ట్ అందించింది. ఈ రిపోర్ట్‌ సహా బాధితురాలి నేపథ్యాన్ని గమనించిన కోర్ట్ పిటిషన్‌ని అంగీకరించింది.