రంజీ ట్రోఫీ 2022లో (Ranji Trophy 2022) తమిళనాడు అన్నదమ్ములు (Tamil Nadu's Baba Twins) అరుదైన రికార్డు నెలకొల్పారు. ఒకే మ్యాచులో ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టిన కవల సోదరులుగా చరిత్ర సృష్టించారు. గువాహటి వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూప్ హెచ్ మ్యాచులో చత్తీస్‌గఢ్‌పై బాబా అపరాజిత్ (Baba Aparajith), బాబా ఇంద్రజిత్ (Baba Indrajith) సెంచరీలు కొట్టేశారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే జట్టు తరఫున శతకాలు బాదేసిన కవలలుగా నిలిచారు.
Tamil Nadu's Baba Twins Centuries
ఈ మ్యాచులో తమిళనాడు మొదట బ్యాటింగ్ చేసింది. బాబా సోదరుల వల్లే 470/9 పరుగులకు తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగలిగింది. ఓపెనర్లు విఫలమైన వేళ బాబా అపరాజిత్ (166; 267 బంతుల్లో 15x4, 4x6), బాబా ఇంద్రజిత్ (127; 141 బంతుల్లో 21x4) సెంచరీలు కొట్టేశారు. ఇంద్రజిత్‌కు ఇది 11వ సెంచరీ కాగా అపరాజిత్‌కు 10వది. వీరిలో ఒకరు వేగంగా ఆడితే మరొకరు నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది.
Baba Indrajith
'మేమిద్దరం కలిసి బ్యాటింగ్ చేస్తుంటే సరదాగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచీ మేమింతే. ఒకరికొకరం సాయం చేసుకుంటాం. మేమిద్దరం గతంలోనూ ఒకే మ్యాచులో సెంచరీలు చేశాం. కానీ వేర్వేరు జట్ల తరఫున చేశాం. ఒకే జట్టు తరఫున సెంచరీలు కొట్టడం, అదీ తమిళనాడు తరఫున చేయడం చాలా ప్రత్యేకం' అని ఇంద్రజిత్ అంటున్నాడు.
Baba Aparajith
'ఇంద్రజిత్ బంతిని చాలా బాగా స్ట్రైక్ చేస్తున్నాడు. అందుకే నేనెలాంటి సిల్లీ పనులు చేయాలనుకోలేదు. వికెట్ నెమ్మదిగా ఉండటంతో నా షాట్లు ఆడేందుకు క్రీజులో నిలదొక్కుకోవాలని అనుకున్నా' అని అపరాజిత్ తెలిపాడు. ఈ ఇద్దరు సోదరులు గతంలో ఒకే మ్యాచులో సెంచరీ కొట్టారు. దులీప్ ట్రోపీలు అపరాజిత్ ఇండియా రెడ్‌కు ఆడితే ఇంద్రజిత్ ఇండియా గ్రీన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.