Rafael Nadal Retirement: గత కొన్నాళ్లుగా గాయాలతో సతమతమవుతున్న స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు కీలక ప్రకటన చేశాడు. గాయాల కారణంగా ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నట్టు నాదల్ తెలిపాడు. ఎర్రమట్టి కోర్టుగా పిలిచే ఫ్రెంచ్ ఓపెన్ లో తన అరంగేట్రం (2005) నుంచి 2022 సీజన్ వరకూ నిరంతరాయంగా ఆడిన నాదల్.. 18 ఏండ్లలో ఏకంగా 14 ట్రోఫీలు గెలిచాడు.
నాదల్ తన కెరీర్ లో మొత్తం 22 గ్రాండ్ స్లామ్స్ నెగ్గితే అందులో అగ్రభాగం (14) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే కావడం గమనార్హం. అందుకే అతడిని మట్టికోర్టు మహారాజు అని పిలుస్తారు అభిమానులు.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి ఈ ఏడాది వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు.
రోలండ్ గారోస్ నుంచి ఔట్..
ఈనెల 28 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ లో ఫస్ట్ రౌండ్ పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నాదల్ ఈ ప్రకటన చేయడం గమనార్హం. గురువారం మలోర్కాలోని తన టెన్నిస్ అకాడమీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాదల్ మాట్లాడుతూ.. ‘గడిచిన నాలుగు నెలలుగా నేను గాయం నుంచి తిరిగి సాధారణ స్థాయికి వచ్చేందుకు చాలా ప్రయత్నించాను. కానీ ఇది చాలా కష్టంగా ఉంది. ఆస్ట్రేలియా ఓపెన్ లో నేను ఎదుర్కున్న సమస్య (గాయం)కు ఇప్పటికీ పరిష్కారం కనుగొనలేకపోయాను. ప్రస్తుతం నేను టెన్నిస్ ఆడేందుకు ఉండాల్సిన ప్రమాణాలతో లేను. రొలాండ్ గారోస్ (ఫ్రెంచ్ ఓపెన్) ఆడే స్థితిలో కూడా లేను.. ప్రస్తుతానికైతే నేను కొన్నాళ్లు ఆటకు బ్రేక్ ఇద్దామనే అనుకుంటున్నా. నేను మళ్లీ ఎప్పుడు ప్రాక్టీస్ కు వస్తానో తెలియదు. అది రెండు నెలలు కావచ్చు. మూడు నెలలు కావచ్చు..’అని చెప్పాడు.
Also Read: కోహ్లీ జెర్సీ నెంబర్ వెనుక ఇంత కథ ఉందా!
వచ్చే ఏడాది రిటైర్మెంట్..?
నాదల్ తాజా ప్రకటనతో అతడు కేవలం ఫ్రెంచ్ ఓపెన్ నుంచే గాక వింబూల్డన్, యూఎస్ ఓపెన్ లో కూడా ఆడేది అనుమానమే. జులైలో వింబూల్డన్ జరుగనుండగా ఆగస్టు - సెప్టెంబర్ లో యూఎస్ ఓపెన్ జరుగనుంది. వచ్చే ఏడాది నాదల్ తన రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయని టెన్నిస్ వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది. 2022 ఆస్ట్రేలియా ఓపెన్ కు ముందు గాయం కారణంగా సుదీర్ఘ కాలం ఆటకు దూరంగా ఉండి ఆస్ట్రేలియా ఓపెన్ ఆడి టైటిల్ గెలిచాడు. ఆ తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ కూడా నెగ్గాడు. కానీ ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ రెండో రౌండ్ లో ఓడిన తర్వాత మళ్లీ టెన్నిస్ రాకెట్ పట్టలేదు. ‘నేను ఇప్పుడే సాధన చేయలేను. అందుకు సిద్ధంగా లేను. ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండటం నాక్కూడా అసహనంగా ఉంది. కానీ ఏదో ఒకరోజు ఆపేయాలి’అని తెలిపాడు.
Also Read: సన్‌రైజర్స్‌లో ఉమ్రాన్ వివాదం - తెర వెనక ఏం జరుగుతుందో తెలియదన్న కెప్టెన్!