Aiden Markram-Umran Malik:
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌లో మరో ముసలం పుట్టిందా? ఉద్దేశపూర్వకంగానే కొందరు ఆటగాళ్లను బెంచీపై కూర్చోబెడుతున్నారా? ఆడగలిగే సామర్థ్యం ఉన్నా జట్టులోకి తీసుకోవడం లేదా? తెర వెనుక ఏం జరుగుతుందో కెప్టెన్‌కే తెలియదా? అంటే అవుననే అనిపిస్తోంది!
డేవిడ్ వార్నర్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ వివాదం గురించి తెలిసిందే. కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌కు కెప్టెన్సీ చేశాడు వార్నర్. 2016లో కప్ అందించాడు. ప్రతి సీజన్లోనూ జట్టును ప్లేఆఫ్‌కు తీసుకెళ్లాడు. అలాంటి రెండేళ్ల క్రితం జట్టుతో అతడికి విభేదాలు వచ్చాయి. తప్పు ఎవరి వైపు ఉందో తెలియదు గానీ మొత్తానికి ఈ ఆస్ట్రేలియా ఓపెనరే బలయ్యాడు. సరైన ఆటగాళ్లను తీసుకోనివ్వడం లేదని అతడు వాపోయాడు. మేనేజ్‌మెంట్‌తో అభిప్రాయబేధాలు రావడంతో సీజన్ మధ్యలో అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించారు. చివరికి తుది జట్టులోనూ చోటివ్వలేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అలాగే తయారైంది! ఆటగాళ్లలో ఏదో రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం లోపంతో ఉంటున్నారు. సామర్థ్యం మేరకు అస్సలు ఆడటం లేదు. యాజమాన్యం, ఆటగాళ్ల మధ్య ఏదో జరుగుతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జమ్మూ ఎక్స్‌ప్రెస్.. 150 కిలోమీటర్ల వేగంతో బంతులేసే ఉమ్రాన్ మాలిక్‌ను (Umran Malik) ఎందుకో తీసుకోవడం లేదో కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్‌కే తెలియదట! తెర వెనక ఏం జరుగుతుందో తనకు తెలియదని అందరి ముందూ చెప్పేశాడు!
'మేం ఎలాగైనా బ్యాటింగే చేయాలనుకున్నాం. అందుకే టాస్ ఓడిపోయినందుకు బాధేం లేదు. కొన్ని మార్పులు చేశాం. బ్రూక్ వస్తున్నాడు. త్యాగీని తీసుకున్నాం. ఉమ్రాన్ మాలిక్ మా ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. అతడి విషయంలో ఏం జరుగుతుందో నిజాయతీగా నాకు తెలియదు. అతడు 150 కిలోమీటర్ల వేగంతో బంతులేస్తాడు. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదు. సన్‌రైజర్స్‌కు ఆడుతున్నందుకు గర్వంగా ఉంది. ఏదేమైనా సామర్థ్యం మేరకు ఆడలేదు. చివరి రెండు మ్యాచుల్లోనైనా మా పవరేంటో ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నాం' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ అయిడెన్ మార్‌క్రమ్ బెంగళూరు మ్యాచ్ టాస్ సమయంలో అన్నాడు.
క్రికెట్ కామెంటేటర్ హర్షభోగ్లే సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు 'తెర వెనుక ఏం జరుగుతుందో తెలియదని కెప్టెనే చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. అతడిని ఆడించకపోవడం నాకు అయోమయంగా అనిపిస్తోంది' అని ట్వీట్ చేశాడు. మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఏకంగా సన్‌రైజర్స్‌పై విమర్శలే గురి పెట్టాడు. 'లీగులోనే అత్యంత వేగంగా బంతులేసే ఫాస్ట్ బౌలర్ బెంచీపై కూర్చోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఉమ్రాన్ మాలిక్‌ను అతడి జట్టు సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదు' అని ట్వీటాడు.
మూడేళ్ల నుంచి ఉమ్రాన్ మాలిక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడుతున్నాడు. 2021లో మూడు మ్యాచులాడి 2 వికెట్లు తీశాడు. ఇక 2022లో అయితే 14 మ్యాచుల్లో 22 వికెట్లతో చెలరేగాడు. 5/25 అత్యుత్తమ గణాంకాలు. అలాంటింది ఈ సీజన్లో కేవలం ఏడు మ్యాచుల్లో 10.35 ఎకానమీతో 5 వికెట్లు పడగొట్టాడు. బౌలింగ్ ప్రదర్శన కాస్త బాగాలేకున్నా.. మిగతా వాళ్లతో పోలిస్తే బెటరే! మొత్తానికి సన్‌రైజర్స్‌లో ఏదో జరుగుతోంది!