Virat Kohli Jersey Number: క్రికెట్ లో ప్రత్యేకంగా నిలిచే ఆటగాళ్ల  పేర్లు, వారి రికార్డులతో పాటు వాళ్ల జెర్సీ నెంబర్స్ కూడా ఎంతో స్పెషల్‌గా ఉంటాయి.  అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా సచిన్ టెండూల్కర్  (10),  ధోని (7)ల జెర్సీ నెంబర్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కు సుపరిచితమే.  ఈ జాబితాలో  మరో వ్యక్తి జెర్సీకి కూడా  ఫుల్ క్రేజ్ ఉంది. అతడెవరో కాదు.   పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ.  కింగ్ కోహ్లీ  జెర్సీ నెంబర్ 18 అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు.


జెర్సీ వెనుక కథ.. 


ఈ జెర్సీ నెంబర్  వెనక  కోహ్లీ(Virat Kohli) ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తనకు ఈ నెంబర్ కావాలని  కోరలేదని,  కానీ తనకు 18 నెంబర్ తో  ప్రత్యేకమైన అనుబంధముందని  తెలిపాడు.   సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ కు ముందు కోహ్లీ మాట్లాడుతూ.. ‘నిజాయితీగా చెప్పాలంటే నేను భారత జట్టు తరఫున అండర్ -19 మ్యాచ్ ఆడుతున్నప్పుడు నాకు  18 నెంబర్ జెర్సీని ఇచ్చినప్పుడు జస్ట్ ఇది కూడా ఒక నెంబర్ మాత్రమే అనుకున్నా. కానీ   దీనితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. నేను భారత జట్టు తరఫున అరంగేట్రం చేసింది  ఆగస్టు 18న.   మా నాన్న చనిపోయిన తేదీ  2006 డిసెంబర్  18. నా జీవితంలో అత్యంత  కీలకమైన  రెండు సందర్భాలు  ఆ తేదీతో ముడిపడి ఉన్నాయి..’అని  చెప్పాడు. 


 






ఇదే రోజు రెండు సెంచరీలు.


ఐపీఎల్ లో కూడా  కోహ్లీ  18వ తారీఖున రెండు సెంచరీలు చేయడం విశేషం. 2016  ఐపీఎల్ లో కోహ్లీ..  మే 18న  కింగ్స్ 11 పంజాబ్ తో మ్యాచ్ లో  సెంచరీ చేశాడు. 50 బంతుల్లోనే కోహ్లీ..   12 బౌండరీలు, 8 సిక్సర్ల సాయంతో  113 పరుగులు చేశాడు. ఇక తాజాగా  గురువారం (2023, మే 18న)  సన్ రైజర్స్  హైదరాబాద్ తో మ్యాచ్ లో కూడా  సెంచరీ చేయడం విశేషం.  


ఈ సీజన్ లో కోహ్లీ.. 


2022 సీజన్ లో  కోహ్లీ అత్యంత చెత్త ప్రదర్శనతో  16 మ్యాచ్ లలో  341 పరుగులు చేశాడు.  ఈ సీజన్ లో  కోహ్లీ ఆట అతడి ఫ్యాన్స్ కు కూడా విసుగు తెప్పించింది. కానీ ఈ సీజన్ లో  మాత్రం కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ -16లో  కోహ్లీ స్కోర్లు ఇలా.. 82, 21,  61, 50, 6, 59, 0, 54, 31, 55, 1, 18, 100  పరుగులు సాధించాడు. ఈ సీజన్ లో ఇప్పటికే కోహ్లీ 538 పరుగులు చేశాడు.  


Also Read: సంజూ, గబ్బర్‌ డిష్యూం డిష్యూం! ఎంఐ, ఆర్సీబీ ఓడితేనే వీళ్లకు ఛాన్స్‌!


Also Read: IPL 2023లో SRH కి పాజిటివ్ థింగ్ ఏదన్నా ఉందంటే అది ఇదే !