Virat Kohli Century: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి  హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం అంటే ప్రత్యేకమైన అనుబంధం.  ఇక్కడ  ఆడిన అంతర్జాతీయ మ్యాచెస్‌తో పాటు ఐపీఎల్ లో కూడా   విరాట్.. భాగ్యనగర అభిమానులు నిరాశపరచలేదు. ఇక్కడ  12 టీ20లలో  అతడు  ఏకంగా 59.2 సగటుతో 592 పరుగులు చేయడం విశేషం.  


ఉప్పల్‌లో కోహ్లీ.. 


కోహ్లీ ఉప్పల్ లో  రెండు టెస్టులు, మూడు వన్డేలు,  రెండు టీ20లు ఆడగా..  ఐపీఎల్ లో భాగంగా  పది మ్యాచ్ లు ఆడాడు.  టెస్టులలో భాగంగా   2017లో ఇదే వేదికపై బంగ్లాదేశ్ తో  జరిగిన  టెస్టులో కోహ్లీ డబుల్ సెంచరీ (204) సాధించాడు.  మిగిలిన మూడు ఇన్నింగ్స్ లలో కూడా 58, 34, 38 పరుగులు చేశాడు. వన్డేలలో కోహ్లీ.. 37, 53, 44 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.  


ఇక అంతర్జాతీయ టీ20లలో గతేడాది  అఫ్గానిస్తాన్ పై సెంచరీ చేసేదాకా కోహ్లీ  అత్యధిక స్కోరు  (94) ఇక్కడే ఉండటం గమనార్హం.  మరో మ్యాచ్ లో 63 పరుగులు చేశాడు. గతేడాది   ఆస్ట్రేలియాపై  అక్టోబర్ లో జరిగిన చివరి టీ20లో  48 బంతుల్లోనే  63 పరుగులు చేసి 187 పరుగుల లక్ష్య ఛేదనలో  భారత్ కు   సూపర్ డూపర్ విక్టరీని అందించాడు. 


ఐపీఎల్‌లో  భాగంగా ఉప్పల్ లో  10 మ్యాచ్ లు ఆడిన విరాట్.. 435 పరుగులు చేశాడు. ఇందులో ఓ  సెంచరీ, రెండు అర్థ సెంచరీలున్నాయి.  


 






500లు ఆరు సార్లు.. 


ఐపీఎల్ లో ఆరు సీజన్లలో 500, ఆ పై పరుగులు చేసిన  ఫస్ట్ ఇండియన్ బ్యాటర్ గా రికార్డులు సృష్టించాడు. 2011 సీజన్ లో  557 పరుగులు చేసిన కోహ్లీ... 2013లో 634, 2015లో 505, 2016లో  973, 2018లో  530  రన్స్ సాధించాడు. ఈ సీజన్ లో ఇప్పటికే కోహ్లీ 538 పరుగులు చేశాడు. 


ఈ సీజన్ లో కోహ్లీ.. 


2022 సీజన్ లో  కోహ్లీ అత్యంత చెత్త ప్రదర్శనతో  16 మ్యాచ్ లలో  341 పరుగులు చేశాడు.  ఈ సీజన్ లో  కోహ్లీ ఆట అతడి ఫ్యాన్స్ కు కూడా విసుగు తెప్పించింది. కానీ ఈ సీజన్ లో  మాత్రం కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఐపీఎల్ -16లో  కోహ్లీ స్కోర్లు ఇలా.. 82, 21,  61, 50, 6, 59, 0, 54, 31, 55, 1, 18, 100  పరుగులు సాధించాడు.


ఇక హైదరాబాద్ - బెంగళూరు మధ్య గురువారం ముగిసిన  మ్యాచ్‌లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్.. నిర్ణీత 20 ఓవ్రలలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ సెంచరీ (104)తో చెలరేగాడు.   లక్ష్యాన్ని ఆర్సీబీ 19.2 ఓవర్లలో అవలీలగా  ఛేదించింది. కోహ్లీ (100) సెంచరీ చేయగా ఫాఫ్ డుప్లెసిస్ (71) లు కలిసి ఫస్ట్ వికెట్ కు 172 పరుగులు జోడించి ఆర్సీబీకి బంపర్ విక్టరీ అందించారు.  ఈ విజయంతో  ఆర్సీబీ.. ప్లేఆఫ్స్  రేసులో ముంబైని వెనక్కినెట్టి నాలుగో స్థానానికి దూసుకెళ్లింది.