Virat Kohli Century: రన్ మిషీన్ మళ్లీ పరుగులు పెట్టింది. ఛేదనలో మొనగాడు.. భారీ టార్గెట్ ను అవలీలగా దంచేశాడు.   ఎంత ఒత్తిడి ఉంటే అంత  మెరుగ్గా ఆడే కింగ్ కోహ్లీ.. ఐపీఎల్-16 లో ఆర్సీబీ ఆశలు సజీవంగా ఉండాలంలే సన్ రైజర్స్ హైదరాబాద్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌‌లో శతకంతో చెలరేగాడు.  ఉప్పల్‌ స్టేడియంలో  ఉప్పెన  సృష్టించి  రికార్డుల  దుమ్ము దులిపాడు. నాలుగేండ్ల తర్వాత ఐపీఎల్ లో శతకం బాదిన  కోహ్లీ ఈ క్రమంలో నెలకొల్పిన రికార్డులు ఇక్కడ చూద్దాం. 


గేల్ రికార్డు సమం :


ఐపీఎల్‌లో కోహ్లీకి ఇది  ఆరో సెంచరీ. తద్వారా అతడు  ఈ లీగ్ లో అత్యధిక సెంచరీల రికార్డు కలిగిన విండీస్ వీరుడు, ఆర్సీబీ మాజీ ఆటగాడు క్రిస్ గేల్  పేరిట ఉన్న ఆరు సెంచరీల రికార్డును సమం చేశాడు.  2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్నా కోహ్లీ 2016లో సెంచరీ  సాధించాడు. ఆ సీజన్ లో కోహ్లీ.. ఏకంగా నాలుగు సెంచరీలతో 973 పరుగులు (ఒక సీజన్ లో ఇప్పటివరకు ఇదే హయ్యస్ట్ స్కోరు)  చేశాడు. ఇక 2019లో మరో సెంచరీ చేసిన విరాట్.. నాలుగేండ్ల తర్వాత మరోసారి మూడంకెల మార్కును అందుకున్నాడు. మరో సెంచరీ చేస్తే   కోహ్లీ.. ఏడు సెంచరీలతో చరిత్ర సృష్టిస్తాడు.  కోహ్లీ, గేల్ తర్వాత జోస్ బట్లర్  ఐదు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. 


 






ఒకే ఫ్రాంచైజీకి.. 


నిన్నటి సెంచరీతో ఆర్సీబీ తరఫున  7,500 పరుగులు పూర్తి చేశాడు విరాట్. ఐపీఎల్ లో ఇటీవలే 7 వేల పరుగుల మార్కును దాటిన కోహ్లీ.. ఈ లీగ్ లో  7,162 పరుగులు చేయగా  ఛాంపియన్స్ లీగ్ లో 338 రన్స్ చేశాడు.  ఒకే ఫ్రాంచైజీకి ఇన్ని పరుగులు చేసిన ఆటగాడు ప్రపంచ ఫ్రాంచైజీ క్రికెట్ చరిత్రలో మరొకరు లేరు. 


డుప్లెసిస్‌తో  సెంచరీ భాగస్వామ్యాలు.. 


సన్ రైజర్స్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్య ఛేదనలో కోహ్లీ.. డుప్లెసిస్ తో కలిసి 172  పరుగులు జోడించాడు.  తద్వారా ఈ ధ్వయం నాలుగు సార్లు సెంచరీ ప్లస్ భాగస్వామ్యాలు నెలకొల్పి ఈ  జాబితాలో రెండో స్థానంలో చేరారు. సన్ రైజర్స్ మాజీ ఓపెనర్లు డేవిడ్ వార్నర్ - జానీ బెయిర్ స్టో  లు ఐదు సార్లు  సెంచరీ ప్లస్ పార్ట్‌నర్‌షిప్స్ తో  ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. ఇదే జాబితాలో కెఎల్ రాహుల్ - మయాంక్ అగర్వాల్ (పంజాబ్), క్రిస్ గేల్ - కోహ్లీ, కోహ్లీ (ఆర్సీబీ) కూడా  నాలుగుసార్లు వంద పరుగుల భాగస్వామ్యాలు నెలకొల్పారు.


 






హయ్యస్ట్ ఓపెనింగ్ స్టాండ్.. 


ఛేదన అంటేనే ఒత్తిడితో కూడిన అంశం. అదీ ఐపీఎల్ లాంటి లీగ్ లో  మరింత ఎక్కువ.  కానీ 187 పరుగుల ఛేదనలో కూడా  వికెట్లేమీ కోల్పోకుండా  కోహ్లీ - డుప్లెసిస్ లు   172 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.  ఐపీఎల్ లో రన్ ఛేజ్ లో హయ్యస్ట్ ఓపెనింగ్ స్టాండ్స్ లో  అత్యధిక పరుగులు జోడించిన  జోడీలలో కోహ్లీ - డుప్లెసిస్ లు నాలుగో  స్థానంలో ఉన్నారు.  గంభీర్ - క్రిస్ లిన్ (కేకేఆర్) లు 2017లో 184 పరుగులు జోడించి ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు.  రెండో స్థానంలో కూడా కోహ్లీ - పడిక్కల్ 181 రన్స్ జత చేశారు. 


ఒకే మ్యాచ్‌లో రెండు సెంచరీలు.. 


ఐపీఎల్ లో ఒకే  మ్యాచ్ లో  రెండు సెంచరీలు సాధించడం ఇది  మూడోసారి. కాగా ఈ మూడింటిలో ఆర్సీబీ భాగస్వామ్యం ఉంది.  ఉప్పల్ మ్యాచ్ లో హెన్రిచ్ క్లాసెన్, కోహ్లీ లు సెంచరీలు చేశారు. 2019లో వార్నర్ - జానీ బెయిర్ స్టో   లు ఆర్సీబీపై సెంచరీలు బాదగా.. 2016 లో  కోహ్లీ - డివిలియర్స్ లు గుజరాత్ లయన్స్ పై  సెంచరీలు చేయడం విశేషం. అయితే గత రెండు సందర్భాలలో ఒకే జట్లు తరఫున  ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేయగా.. చరిత్రలో తొలిసారి   రెండు జట్ల నుంచి ఒక్కొక్కరు శతకం బాదడం ఇదే ప్రథమం.