PV Sindhu gets Engaged To Venkata Datta Sai | భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు (PV Sindhu) త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తెలిసిందే. ఈ క్రమంలో పీవీ సింధు నిశ్చితార్థ వేడుక శనివారం నాడు ఘనంగా జరిగింది. వ్యాపారవేత్త వెంకటసాయితో బ్యాడ్మింటన్ స్టార్ సింధు ఎంగేజ్‌మెంట్ డిసెంబర్ 14న నిర్వహించారు. పెద్దల సమక్షంలో వీరు ఉంగరాలు మార్చుకున్నారు.
తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోను సింధు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. ప్రేమ దొరికినప్పుడు, మనం కూడా అదే ప్రేమను ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ తనంతట తాను దొరకదు అని అర్థం వచ్చేలా ఖలీల్ జిబ్రాన్ కోట్‌ను క్యాప్షన్‌గా రాసుకొచ్చారు సింధు. డిసెంబర్ 22న ఉదయ్‌పూర్ లో సింధు, వెంకటసాయిల వివాహం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. అనంతరం డిసెంబర్ 24న హైదరాబాద్ లో మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే వెల్లడించారు.
సింధుకు కాబోయే భర్త ఎవరు..
హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పీవీ సింధు, వెంకట దత్తసాయిలు ఈ నెల 22న వివాహబంధంతో ఒక్కటి కానున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించడానికి కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 20 నుంచి పెళ్లి వేడుకలు ఊపందుకోనున్నాయి. వీరి వివాహానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, తెలుగు రాష్ట్రాల సీఎంలు, పలువురు క్రీడా ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి.
ఒలింపిక్స్‌లో రెండు పతకాలు
పీవీ సింధు ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు సాధించిన తొలి భారత మహిళా క్రీడాకారిణి. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకంతో మెరిసింది. 2019లో ఒక స్వర్ణంతో సహా 5 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు సింధు కొల్లగొట్టారు. 2017లో కెరీర్ లో పీవీ సింధు అత్యున్నత ప్రపంచ ర్యాంక్ 2ని సాధించింది. ఇటీవల జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 బ్యాడ్మింటన్ టోర్నీలో ఛాంపియన్ గా నిలిచింది. భారత్ నుంచి అత్యుత్తమ ప్లేయర్లలో సింధు విజయాల ప్రస్థానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది.