Sa Vs Pak T20 Series: పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20ల్లో సరికొత్తగా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యంత వేగవంతంగా 11 వేల మైలురాయికి చేరుకున్న క్రికెటర్ గా నిలిచాడు. కెరీర్ 298 ఇన్నింగ్సలో బాబర్ ఈ ఘనత సాధించాడు. శుక్రవారం సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 20 బంతుల్లో 31 పరుగులు చేసిన బాబర్.. ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటవరకు ఈ రికార్డు, వెస్టిండీస్ మాజీ కెప్టెన్, యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. తను 314 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించగా, అంతంకటే 16 తక్కువ ఇన్నింగ్సల్లోనే బాబర్ గేల్ ను దాటేశాడు. ఓవరాల్ గా 309 మ్యాచ్ లు ఆడిన బాబర్ 11 సెంచరీలు, 90 ఫిఫ్టీలు సాధించాడు. మొత్తంగా టీ20ల్లో తన పరుగుల సంఖ్యను 11,020కి పెంచుకున్నాడు.
ఇప్పటివరకు 11 మందే..
ఇక టీ20ల్లో 11వేల పరుగులు మార్కును ప్రపంచమొత్తం మీద కేవలం 11 మంది క్రికెటర్లే దాటారు. అందులో క్రిస్ గేల్ (14,562) టాప్ లో నిలిచాడు. పాకిస్తాన్ కి చెందిన షోయబ్ మాలిక్ (13,415), వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ (13,335), ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12,987), భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (12,886), ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (12,411), ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ (11,967), భారత ప్లేయర్ రోహిత్ శర్మ (11,830), ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11,458), ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ విన్స్ (11,158) మాత్రమే ఈ క్లబ్బులో స్థానం సాధించారు. ఓవరాల్ గా వెస్టిండీస్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, పాక్ నుంచి ఇద్దరు, ఆసీస్ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ఈ ఎలైట్ క్లబ్బులో నిలిచారు.
Also Read: Jasprit Bumrah: బ్రిస్బేన్ పిచ్‌పై బుమ్రా అసహనం - అవి లేవంటు కంప్లైంట్ ఇచ్చిన స్టార్ పేసర్
సౌతాఫ్రికాకు సిరీస్ కోల్పోయిన పాక్..
ఇక బాబర్ ఘనత పాక్ ను కాపాడలేక పోయింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ ను మరో మ్యాచ్ ఉండగానే 0-2తో పాక్ కోల్పోయింది. తొలి మ్యాచ్ లో 11 పరుగులతో ఓడిన పాక్.. రెండో టీ20లో ఏడు వికెట్లతో పరాజయం పాలైంది. శుక్రవారం సెంచరియాన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు చేసింది. సయ్యుమ్ అయూబ్ (98 నాటౌట్) కాస్తలో శతకం మిస్సయ్యాడు. అతనితోపాటు బాబర్, ఇర్ఫాన్ ఖాన్ (30) రాణించారు. ఛేదనను సఫారీలు 19.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి పూర్తి చేశారు. దీంతో ఏడు వికెట్లతో పాక్ ను ప్రొటీస్ చిత్తు చేసినట్లయ్యింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (117) ఆకాశమే హద్దుగా చెలరేగి, పాక్ బౌలర్లను ఊచకోత కోశాడు. వాన్ డర్ డస్సెన్ (66) ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. సిరీస్ లో చివరిదైన మూడో టీ20 శనివారమే జరుగుతుంది.