PAK vs SL, Asia Cup Final: ఆసియాకప్‌-2022లో ఆఖరి మ్యాచుకు వేళైంది! పొరుగు దేశాలు పాకిస్థాన్‌, శ్రీలంక ఫైనల్లో కొట్లాడబోతున్నాయి. వీరిలో ఎవరు విజేతగా ఆవిర్భవిస్తారోనన్న ఆసక్తి నెలకొంది. వారి సొంత దేశాల కన్నా ఎక్కువగా ఇండియా ఫ్యాన్స్‌ ఇంట్రెస్టు చూపిస్తున్నారు. సహజంగానే శత్రువుకు శత్రువు మిత్రుడే కాబట్టి లంకేయులకే భారతీయులు సపోర్ట్‌ చేస్తున్నారు! పరిస్థితులు కఠిన సవాళ్లు విసురుతున్నా తలెత్తుకొని వారు  పోరాడుతున్న తీరు ఆకట్టుకుంటోంది. మరి వీరిలో గెలుపెవరిది? ఏ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయి?


పోయేదేం లేదు!


ఈ టోర్నీలో లంకేయులను ఎంత మెచ్చుకున్నా తక్కువే! ఆతిథ్య జట్టే అయినా పరాయిదేశంలో ఆడుతున్నారు. తొలి మ్యాచులోనే ఘోర పరాజయం చవిచూసినా ధైర్యంగా నిలబడ్డారు. అత్యంత కీలకమైన బంగ్లా పోరులో ఆఖరి క్షణాల్లో థ్రిల్లింగ్‌ విక్టరీతో సూపర్‌-4కు వచ్చారు. ఆ గెలుపు ఇచ్చిన విశ్వాసమో, పోరాడితే పోయేదమీ లేదన్న ధోరణో తెలీదు కానీ ఆడిన ప్రతి మ్యాచులోనూ విజయం అందుకుంటున్నారు. ఓపెనర్లు పాథుమ్‌ నిసాంక, కుశాల్‌ మెండిస్‌ పవర్‌ప్యాక్డ్‌ ఓపెనింగ్‌ ఇస్తున్నారు. ఆ తర్వాత కెప్టెన్‌ దసున్‌ శనక, భానుక రాజపక్ష మిడిలార్డర్లో గెలిచేంత వరకు ఉంటున్నారు. మిగతా బ్యాటర్లూ పర్లేదు. ఇక హసరంగ మిస్టరీ స్పిన్‌తో, మహీశ్‌ థీక్షణ, ప్రమోద్‌ మదుశనక పేస్‌తో వికెట్లు పడగొడుతున్నారు. చివరి సూపర్‌-4 మ్యాచులో పాక్‌ను ఓడించడం ప్లస్‌ పాయింట్‌. గెలిచిన అన్ని మ్యాచుల్లోనూ వీరు ఛేదనే చేయడం గమనార్హం. ఒకవేళ తొలుత బ్యాటింగ్‌ చేస్తే పరిస్థితి ఏంటన్నది తెలీదు!!


ఆడతారు.. కానీ!


తమదైన పేస్‌ బౌలింగ్‌ బలం లేకున్నా పాకిస్థాన్ ఫైనల్‌ చేరుకున్న తీరు అనూహ్యం! లీగ్‌ దశలో ఓటమి రుచిచూపించిన టీమ్‌ఇండియాపై సూపర్‌-4 తొలి మ్యాచులోనే ప్రతీకారం తీర్చుకున్నారు. రెండో మ్యాచులో అఫ్గాన్‌పై దాదాపుగా చచ్చి బతికారు! మూడోదైన లంక మ్యాచులో ఘోరంగా ఓడిపోయారు. టాస్‌ గెలవడం, తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకోవడం, ఒకప్పుడు దుబాయ్‌లో ఎక్కువ క్రికెట్‌ ఆడటం వీరికి కలిసొస్తోంది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ పాక్‌ ప్రధాన బలం. అతడిని త్వరగా ఔట్‌ చేశారంటే ప్రత్యర్థి సగం గెలిచినట్టే! బాబర్‌ ఆజామ్‌ ఫామ్‌ అందుకోవాల్సిన అవసరం ఉంది. మిడిలార్డర్‌ పేలవమే కానీ మూమెంటమ్‌ను షిప్ట్‌ చేయగల అనుభవం వీరికి ఉంది. కొత్తగా వచ్చిన కుర్ర పేసర్‌ నసీమ్‌ షా అఫ్గాన్‌పై ఆఖరి ఓవర్లో 2 సిక్సర్లు బాది గెలిపించడం ఇలాంటిదే. బౌలింగ్‌ పరంగా పాక్‌కు ఇబ్బందేమీ లేదు. లంకపై మరీ మెరుగైన రికార్డేమీ లేకపోవడం మైనస్‌ పాయింట్‌.


లంకదే దూకుడు


అంతర్జాతీయ క్రికెట్లో ఈ రెండు దాదాపుగా సమవుజ్జీలే! ఆసియాకప్‌ వన్డేల్లో మాత్రం లంకదే తిరుగులేని ఆధిపత్యం. ఇదే టోర్నీ టీ20 ఫార్మాట్లో 1-1తో సమంగా ఉన్నారు. ఈ రెండు జట్లు ఆడిన చివరి ఐదు టీ20ల్లో లంక 4 మ్యాచులు గెలిచి దూకుడు మీదుంది. 2019లో లాహోర్‌కు వెళ్లి 3-0తో టీ20 సిరీస్‌ పట్టేసింది. ఆసియాకప్‌లో శుక్రవారం నాటి మ్యాచులో దుమ్మురేపింది. వాస్తవంగా ఈ ఏడాది టీ20ల్లో లంకకేమీ కలిసిరాలేదు. ఆస్ట్రేలియా, ఇండియా చేతుల్లో చిత్తైంది. అలాంటిది ఆసియాకప్‌లో చెలరేగుతుండటం వారికి ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఎవరెన్ని చెప్పినా దుబాయ్‌లో టాస్‌దే విజయం. ఒకవేళ తొలుత బ్యాటింగ్‌లో 185+ కొట్టినా మెరుగైన బౌలింగ్‌ ఉంటే తప్ప గెలవలేని పరిస్థితి. ఈ ఒక్క ఫ్యాక్టరే ఆసియాకప్‌ విజేతను నిర్ణయిస్తుంది.


Pakistan vs Sri Lanka T20 ProbableXI


శ్రీలంక: నిశాంక్, కుశాల్ మెండిస్, అసలంక, గుణతిలక, భానుక రాజపక్స, దసున్ శనక (కెప్టెన్), హసరంగ, చామిక కరుణరత్నే, తీక్షణ, దిల్షాన్, మదుశంక.


పాకిస్థాన్‌ : బాబర్‌ ఆజామ్‌ (కెప్టెన్‌), మహ్మద్‌ రిజ్వాన్‌, ఫకర్‌ జమాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌, కుష్‌దిల్‌ షా, షాబాద్‌ ఖాన్‌, అసిఫ్‌ అలీ, మహ్మద్‌ నవాజ్‌, నసీమ్‌ షా, హ్యారిస్‌ రౌఫ్, మహ్మద్‌ హస్నైన్‌