IND-W vs ENG-W 1st T20: ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత అమ్మాయిలు నేడు తొలి టీ20 ఆడనున్నారు. చెస్టర్ లీ స్ట్రీట్ మైదానంలో ఈ గేమ్ జరగనుంది. మూడు టీ20 మ్యాచుల సిరీస్ కోసం మహిళల టీమిండియా జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తుంది.  భారత కాలమానం ప్రకారం రాత్రి 11.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను సోనీ టెన్- 1 ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. 


అంతర్జాతీయ క్రికెట్ లో భారత అమ్మాయిల జట్టు మెరుగ్గా రాణిస్తోంది. అయితే ఫినిషింగ్ లోపాలతో బాధపడుతోంది. అప్పటిదాకా బాగా ఆడుతున్న మహిళలు చివర్లో సరిగ్గా ఆడక గెలిచే మ్యాచులను కోల్పోతున్నారు. ముఖ్యంగా లక్ష్యాలను ఛేదించేటప్పుడు ముందు బాగా ఆడినా.. ఆఖర్లో త్వరత్వరగా వికెట్లు కోల్పోయి ఓటమి చవిచూస్తున్నారు. 


దీనిపై కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ.. ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం చేయమని చెప్పింది. కామన్వెల్త్ గేమ్స్ లో బాగా ఆడామని.. అయినా ఇంకా మెరుగవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. తమ ఆటలోని లోపాలు సరిదిద్దుకుని ఇంగ్లండ్ తో సిరీస్ లో బాగా ఆడతామని స్పష్టంచేసింది. కామన్వెల్త్ గేమ్స్ లో ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన భారత అమ్మాయిలు రజత పతకంతో సరిపెట్టుకున్నారు.