Vinesh Phogat Receives Grand Welcome: ఏంటా స్వాగతం.... భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు ఎంత సంబరమో... ఒలింపిక్స్‌లో పతక వీరులు స్వదేశంలో అడుగుపెట్టినప్పుడు ఎంతటి వేడుకలో.. అంతటి వేడుకలు. అయితే వచ్చింది విశ్వ క్రీడల్లో సత్తా చాటి పతకంతో స్వదేశంలో అడుగుపెట్టిన అథ్లెట్ కాదు. ఒలింపిక్స్‌లో అనర్హతకు గురై... తీవ్ర నిరాశతో భారత్‌లో అడుగుపెట్టిన ఆ స్టార్ రెజ్లర్‌కు కనీవినీ ఎరుగని స్వాగతం లభించింది. అసలు తమకు ఈ స్థాయిలో అపూర్వ స్వాగతం లభిస్తుందని ఊహించని ఆ స్టార్ రెజ్లర్... కన్నీళ్లు పెట్టుకుంది. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నామో మీకు ఈపాటికే అర్థమైపోయి ఉంటుంది. అవును వినేశ్ ఫొగాట్‌కు లభించిన ఘన స్వాగతం... దేశంలో క్రీడల పట్ల ఉన్న అభిమానాన్ని మరోసారి కళ్లకు కట్టింది. అందుకే ఈ ఘన స్వాగతం తర్వాత వినేశ్ ఫొగాట్(Vinesh Phogat) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఒలింపిక్స్ నిర్వహక కమిటీ తనకు పతకం ఇచ్చేందుకు నిరాకరించిందని... కానీ ఇప్పుడు వెయ్యి గోల్డ్ మెడల్స్ సాధించినంత ఆనందం కలుగుతోందని వినేశ్ ఫొగాట్ వ్యాఖ్యానించింది. ఈ అభిమానాన్ని కలకాలం గుండెల్లో దాచుకుంటానని వ్యాఖ్యానించింది.
ఘన స్వాగతాన్ని మించి...
పారిస్ నుంచి స్వదేశంలో అడుగుపెట్టిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అంతేనా అక్కడి నుంచి ఆమెను వాహనంపైన కూర్చొబెట్టి ఊరేగించారు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. పారిస్ నుంచి స్వదేశానికి తిరిగివచ్చిన తనకు లభించిన ఘన స్వాగతంపై స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు లభించిన ప్రేమాభిమానాలు వెయ్యి బంగారు పతకాల కంటే విలువైనవని వినేశ్ తెలిపింది. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది. తనకు పారిస్ ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ ఇవ్వలేదని... కానీ ఇక్కడి ప్రజలు ఇచ్చారని వెల్లడించింది. తన తల్లి గురించి మాట్లాడుతూ.. వినేష్ ఫోగట్ భావోద్వేగానికి గురైంది. "ఉన్నతంగా మేం బతకాలని మా అమ్మ కోరుకుంది. స్వతంత్రంగా ఉండాలని, ఎవరి కాళ్ల మీద వారు జీవించాలని చెబుతూ ఉండేది. పోరాడుతూనే ఉండాలి అని మా అమ్మ చెప్పిన మాటలు ఎప్పుడూ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇప్పుడు నేను ఇలా ఉండటానికి ఆమె పట్టుదలే కారణం. ఎలా పోరాడాలనే దాని గురించి నాకు నేర్పింది.’’ అని వినేశ్ వెల్లడించింది.
వినేశ్ భర్త సంచలన వ్యాఖ్యలు
మరోవైపు భారత రెజ్లింగ్ సంఘం(WFI) పై రెజ్లర్ వినేశ్ ఫొగాట్ భర్త సోమ్‌వీర్ రాథీ కీలక ఆరోపణలు చేశారు. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్‌లో అనర్హత వేటుకు గురైన వినేశ్‌కు WFI మద్దతుగా నిలవలేదని విమర్శించారు. అభిమానుల నుంచి వచ్చిన ప్రేమకు సోమ్‌వీర్ ధన్యవాదాలు తెలిపారు.