Vinesh's Husband On WFI After Wrestler's Shocking Retirement: ఇటీవల ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ (Vinesh Phogat) ఫైనల్‌కు చేరి పతకం ఖరారు చేసుకున్నా నిరాశే ఎదురైంది. అయితే ఆ తర్వాత 100 గ్రాముల అధిక బరువు ఎక్కువగా ఉందన్న కారణంతో ఆమెపై ఒలింపిక్స్ నిర్వహక కమిటీ నిషేధం విధించింది. ఆ తర్వాత వినేశ్ కోర్ట్ ఆఫ్ ఆర్బిటరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ( CAS) ను ఆశ్రయించినా అక్కడా ఆమెకు సానుకూల నిర్ణయం రాలేదు. వినేశ్ తరపు లాయర్లు సమర్థంగా వాదనలు వినిపించినా... సానుకూల తీర్పైతే రాలేదు. దీంతో రిక్త హస్తాలతోనే వినేశ్... స్వదేశానికి తిరిగి వచ్చింది. పతకం తేకపోయినా " నువ్వే మా ఛాంపియన్" అంటూ వినేశ్‌కు భారతావని అఖండ స్వాగతం పలికింది. ఈ ఘన స్వాగతంతో వినేశ్ కూడా భావోద్వేగానికి గురైంది. ఇక్కడివరకూ అంతా బాగానే ఉన్న ఇప్పుడు తాజాగా వినేశ్ భర్త చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీశాయి. అసలు వినేశ్‌కు భారత రెజ్లింగ్ సంఘం ఎలాంటి మద్దతు ఇవ్వలేదన్న వినేశ్ ఫొగాట్ భర్త సోమ్‌వీర్ రాథీ(Somvir Rathee) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. రెజ్లింగ్ సమాఖ్య మద్దతు ఇవ్వకపోతే అసలు అథ్లెట్లు ఎలా అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని ప్రశ్నించారు.
సంచలన ఆరోపణలు
పారిస్ వేదికగా జరిగిన విశ్వ క్రీడల్లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లింగ్ సమాఖ్య నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని వినేశ్ వినేశ్ ఫొగాట్ భర్త సోమ్‌వీర్ రాథీ సంచలన ఆరోపణలు చేశారు. మహిళల 50 కేజీల రెజ్లింగ్‌లో ఛాంపియన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన వినేశ్‌కు WFI నుంచి ఎలాంటి మద్దతు లభించలేదని సోమ్‌వీర్ తెలిపారు. ఫైనల్లో అనర్హత వేటుకు గురైన ఫొగాట్ తీవ్ర నిర్వేదంలో కూరుకుపోయిందని అన్నారు.
వినేశ్ ఫొగాట్ రిటైర్‌మెంట్ ప్రకటనపైనా సోమ్‌వీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వినేశ్ ఫొగాట్ రిటైర్‌మెంట్ ప్రకటనను వెనక్కి తీసుకుంటుందా అన్న ప్రశ్నకు సోమ్‌వీర్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. పారిస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టిన వినేశ్‌కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహని ఎయిర్‌పోర్ట్‌కు తరలివచ్చి ఫొగాట్‌కు బ్రహ్మరథం పట్టారు. వినేశ్‌కు లభించిన ఘన స్వాగతంపై సోమ్‌వీర్ భావోద్వేగానికి గురయ్యాడు. అసలు తాము ఇంతటి ఘన స్వాగతాన్ని ఊహించలేదని.. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదని వినేశ్ భర్త తెలిపారు. వినేశ్ ఫొగాట్‌కు భారత రెజ్లర్లూ అందరూ మద్దతుగా నిలిచారని... వారికి కృతజ్ఞతలని వెల్లడించారు. భారత్‌కు మరో మెడలో వెంట్రుకవాసిలో చేజారిందని సోమ్‌వీర్ తెలిపారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మద్దతు లేకపోతే రెజ్లర్లు నిర్భయంగా ఎలా ప్రదర్శన చేయగలరని సోమ్‌వీర్ ప్రశ్నించారు.
అయితే వినేశ్ రిటైర్‌మెంట్‌పై ఆమె సోదరుడు హర్విందర్ ఫొగాట్ స్పందించారు. వినేశ్ రిటైర్‌మెంట్‌ను వెనక్కి తీసుకొనేలా ప్రయత్నిస్తామని హర్విందర్ తెలిపారు. రిటైర్‌మెంట్‌పై తప్పకుండా వినేశ్‌తో మాట్లాడతామని తెలిపారు.