టోక్యో ఒలింపిక్స్‌లో ఓ క్రీడాకారిణి స్వర్ణ పతకం సాధించడం వెనుక కండోమ్ కీలక పాత్ర పోషించిందంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. ఈ క్రీడల్లో క్యానో స్ప్రింట్ అనే ఒక విభాగం ఉంది. నీటిపై కయాకింగ్ చేయడమే ఈ ఈవెంట్ ప్రత్యేకత. ఆస్ట్రేలియాకు చెందిన 27 ఏళ్ల జెస్సికా ఫాక్స్.. ఈ వారంలో జరిగిన క్యానో స్ప్రింట్ స్లాలోమ్ సీ1 విభాగంలో అందర్నీ ఓడించి స్వర్ణ పతకం గెలుచుకుంది. అలాగే క్యానో స్లాలామ్ కె1 ఫైనల్‌లోనూ కాంస్యం సాధించింది. అయితే, ఇదంతా ఒక కండోమ్ సాయంతోనే జరిగిందని ఆమె అంటోంది. అందుకు సంబంధించిన వీడియోను సైతం సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.
క్యానో స్ప్రింట్ పోటీల్లో కయాకింగ్ ఒకటి. సన్నగా ఉండే పడవలో కేవలం ఒకరు మాత్రమే కూర్చొని తన శక్తి సామర్థ్యాలతో సరస్సులు, లేదా నదులపై ముందుకు సాగుతారు. అయితే, ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న జెస్సికాకు అనుకోకుండా ఒక అవాంతరం ఏర్పడింది. తన పడవ మరమ్మతుకు గురైంది. ఈ క్రమంలోనే దాన్ని సరిదిద్దేందుకు కార్బన్ మిశ్రమాన్ని ముందు భాగంలో అదిమిపెట్టి తర్వాత నీటిలో అది తొలగిపోకుండా ఉండేందుకు స్మూత్ ఫినిషింగ్ కోసం కండోమ్‌ని వాడినట్టు ఆమె చెప్పింది. అలా తన విజయానికి ఆఖరి నిమిషంలో కండోమ్ ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. దీంతో పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆ పడవ రిపేర్‌కు సంబంధించి ఆ కండోమ్‌ని ఎలా వాడారో తెలియజేసే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
జెస్సికా పెట్టిన పోస్ట్ లకు అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాట్ ఏన్ ఐడియా! కదా.. అంటూ ఆ పోస్టులను షేర్ చేస్తున్నారు.