టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఈ రోజు మరో పతకం దిశగా సాగుతోంది. క్వార్టర్ ఫైనల్లో భారత స్టార్ ప్లేయర్ సింధు... జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై రెండు వరుస సెట్లలో విజయం సాధించి సెమీఫైనల్‌కి దూసుకెళ్లింది.  


మ్యాచ్ ఆరంభం తొలి సెట్ ఆరంభంలో కాస్త తడబడిన సింధు ఆ తర్వాత 11-7 తో బ్రేక్ తీసుకుంది. విరామం తర్వాత యమగూచి కాస్త దూకుడు పెంచింది. అయినప్పటికీ సింధు తన దాడితో తొలి సెట్‌ను 21-13తో సొంతం చేసుకుంది. రెండో సెట్‌లో బ్రేక్ వరకు ప్రత్యర్థి నుంచి సింధుకు ఏమాత్రం ప్రతిఘటన ఎదురుకాలేదు. 11-6 ఆధిక్యంతో మళ్లీ బ్రేక్ తీసుకుంది సింధు. ఇక మ్యాచ్ సింధు సొంతం అనుకున్నారు. కానీ, ఒక్కసారిగా యమగూచిలో ప్రతిఘటన ప్రారంభమైంది. దీంతో ఒకానొక సమయంలో యమగూచి 15-15తో స్కోరును సమం చేసింది.


ఆ తర్వాత సింధు అనవసర తప్పిదాలు చేయడంతో యమగూచి 18-16తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సింధు మ్యాచ్ చేజార్చుకుంటుందేమో అని భావించారు. కానీ, ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ పాయింట్లు సాధిస్తూ వచ్చారు. 20-20తో మరోసారి ఇద్దరూ స్కోరును సమం చేశారు. ఆ తర్వాత సింధు వరుసగా రెండు పాయింట్లు సాధించి 22-20తో సెట్‌తో పాటు గేమ్‌ను సొంతం చేసుకుంది. తనదైన స్మాష్‌లతో సింధు మ్యాచ్ ఆసాంతం ప్రత్యర్థిపై విరుచుకుపడింది. కోర్టు నలువైపులా ప్రత్యర్థిని పరుగులు పెట్టించింది.  యమగూచిపై తన గెలుపోటముల రికార్డును సింధు మెరుగుపరుచుకుంది. ముఖాముఖి పోరులో యమగూచిపై 6-1తో పీవీ సింధుదే ఆధిపత్యం. ఈ విజయంతో తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంది.


రియో ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సింధు... టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాలనే కాంక్షతో పోరాటం కొనసాగిస్తోంది. తాజాగా సెమీఫైనల్స్‌కు చేరుకుంది. అభిమానుల భారీ అంచనాల నడుమ టోక్యోలో అడుగుపెట్టిన సింధు ఇప్పటికే కాస్త ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పింది. మరి, ఒత్తిడిని జయించి సింధు సెమీఫైనల్ ఆ తర్వాత ఫైనల్ గెలిచి తన స్వర్ణ పతక కలను సాకారం చేసుకుంటుందేమో చూడాలి. 


సింధు సెమీఫైనల్ చేరడంతో ఆమెపై అంచనాలు మరింతగా పెరిగాయి. సెమీస్ చేరిన నలుగురు క్రీడాకారుల్లో ఫైనల్ చేరిన వారిలో ఒకరికి స్వర్ణం, మరొకరికి రజతం లభిస్తుంది. సెమీఫైనల్లో ఓటమి చెందిన వారికి నిర్వహించే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన వారికి కాంస్యం బహుకరిస్తారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన సింధు అన్ని మ్యాచ్లో రెండు వరుస సెట్లలో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరింది. సొంతగడ్డపై ఒలింపిక్స్ ఆడుతోన్న యమగూచి ఎలాగైనా పతకం సాధించాలన్న ఆలోచనతో తీవ్రమైన ఒత్తిడికి గురై ఓటమి పాలైంది.