లంకలో పర్యటిస్తోన్న భారత జట్టులో కరోనా కల్లోలం సృష్టించింది. తాజాగా భారత్ ఆటగాళ్లు యుజ్వేంద్ర చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ కరోనా పాజిటివ్‌గా తేలారు. దురదృష్టవశాత్తూ టీమిండియా ఆటగాళ్లు ఇద్దరు కరోనా పాజిటివ్‌గా తేలారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ కృనాల్ పాండ్యకు క్లోజ్‌గా ఉన్న ఆటగాళ్లు. వీరు జట్టుతో కలిసి లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


రెండు రోజుల క్రితం భారత్ X శ్రీలంక మధ్య రెండో టీ20కి ముందు భారత ఆటగాళ్లకు కరోనా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాల్లో కృనాల్ పాండ్య కరోనా పాజిటివ్‌గా తేలాడు. వెంటనే అప్రమత్తమైన జట్టు మేనేజ్‌మెంట్ కృనాల్ పాండ్యతో పాటు అతడితో క్లోజ్‌గా ఉన్న 8మంది ఆటగాళ్లను గుర్తించి ఐసోలేషన్ చేశారు. వారిలో హార్దిక్ పాండ్య, పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్ చాహర్, మనీశ్ పాండే, ఇషాన్ కిషన్, చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ ఉన్నారు. అలాగే మిగతా ఆటగాళ్లందరికీ RT-PCR టెస్టులు చేయించారు. అదృష్టవశాత్తూ మిగతా వారికి నెగిటివ్ వచ్చింది. దీంతో ఇరు జట్ల మధ్య 27న జరగాల్సిన T20ని తర్వాతి రోజుకు వాయిదా వేశారు. జట్టు మేనేజ్‌మెంట్ తాజాగా ఐసోలేషన్లో ఉన్న వారికి మరోసారి పరీక్షలు నిర్వహించినట్లు ఉంది. ఇందులో చాహల్, క్రిష్ణప్ప గౌతమ్‌ పాజిటివ్‌గా తేలినట్లు తెలిసింది. 


దీంతో లంకలో భారత పర్యటన ముగిసినట్లే. షెడ్యూల్ ప్రకారం భారత ఆటగాళ్లు ఈ రోజు భారత్‌కు బయలుదేరాలి. సోమవారం రాత్రి కృనాల్ పాండ్యాతో కలిసి ఈ ఎనిమిది మంది భోజనం చేసినట్లు అధికారులు గుర్తించారు. మంగళవారమే ఆ 8 మందికి ఆర్‌టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించగా.. అందరికీ నెగటివ్ వచ్చింది. అయినప్పటికీ.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బుధ, గురువారం జరిగిన రెండు టీ20 మ్యాచ్‌లకీ ఆ 8 మందిని ఆడించలేదు. ఇరు జట్ల మధ్య గురువారంతో మూడు T20ల సిరీస్ ముగిసింది. 2-1తేడాతో లంక సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను గబ్బర్ సేన 2-1తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.   


మరో‌పక్క ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సిన పృథ్వీ షా, సూర్యకుమార్‌  పరిస్థితి కూడా ఆగమ్యగోచరంగా ఉంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న వీళ్లు మరో రెండు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల్లో కరోనా నెగటివ్ వచ్చిన తర్వాతే ఇంగ్లాండ్ బయల్దేరతారు. ఆగస్టు 4 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. ఇప్పటికు కోహ్లీ సేన ఇంగ్లీష్ గడ్డపై ఐసోలేషన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది.