టోక్యో పారాలింపిక్స్ లో పతకాల పంట పండిస్తున్న భారత్‌కు షాక్ తగిలింది. డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్ ను అనర్హుడిగా ప్రకటించారు. ఈ మేరకు టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ అధికారులు నిర్ణయాన్ని వెల్లడించారు. దాంతో వినోద్ కుమార్ సాధించిన కాంస్య పతకం వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. డిస్కస్ త్రో విభాగంలో 19.91 మీటర్లు విసిరి వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించడం తెలిసిందే. అయితే డిస్కస్ ఎఫ్52 కేటగిరీలో వినోద్ కుమార్ ను అనర్హుడిగా ప్రకటించారు. భారత్ ఖాతాలో ఓ పతకం తగ్గుతుంది.
Also Read: Vinod Kumar wins Medal: భారత్ ఖాతాలో మరో పతకం.. 'డిస్కస్ త్రో'లో వినోద్ కుమార్ కు కాంస్యం
వాస్తవానికి ఆదివారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో ఎఫ్52 విభాగంలో వినోద్ కుమార్ భారత్ నుంచి బరిలోకి దిగారు. అంచనాల మేర రాణించి పతకాన్ని సాధించారు. మూడో స్థానంలో నిలిచిన వినోద్ కుమార్ కు కాంస్యం లభించింది. అయితే పోటీలో పాల్గొన్న ఇతర ఆటగాళ్లు వినోద్ ఎంపిక, వర్గీకరణపై నిరసన తెలిపారు. అందువల్ల నిర్వాహకులు వినోద్‌కు కాంస్య పతకాన్ని అందించలేదు. పూర్తి వివరాలు ప్రకటించిన అనంతరం పతకాన్ని అందజేస్తామని పేర్కొన్నారు. కానీ చివరికి నిరాశే మిగిలింది.
ఏమిటీ వివాదం...
డిస్కస్ త్రోలో ఎఫ్52 విభాగంలో పరిమిత కదలిక అవయవలోపం ఉన్నవాళ్లు, కాళ్లు సరిగాలేని వాళ్లు, కండరాల శక్తి సాధారణంగా ఉన్న వారు, వెన్నెముక లోపం ఉన్నవారితో పాటు కేవలం కూర్చునే స్థితికి పరిమితమైన వారిని మాత్రమే అనుమతిస్తారు. అయితే వినోద్ కుమార్‌ను ఏ కారణంతో ఎంపిక చేశారనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేదు. దీంతో వినోద్ కుమార్ పతకం నెగ్గగానే తోటి అథ్లెట్లు వినోద్ కుమార్ ఎంపికపై, అతడి అర్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఎఫ్52 విభాగం అర్హతలు పరిశీలించిన టోక్యో పారాలింపిక్స్ టెక్నికల్ విభాగం అధికారులు వినోద్ కుమార్ ఈ పోటీకి అనర్హుడిగా తుది నిర్ణయాన్ని వెల్లడించారు.