టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్, ఫస్ట్ క్లాస్ క్రికెట్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరఫున 6 టెస్టులు, 14 వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించాడు. 37 ఏళ్ల కర్ణాటక క్రికెటర్ సోమవారం నాడు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు. టీమిండియా తరఫున వన్డేల్లో బెస్ట్ గణాంకాలు బిన్నీ పేరిటే ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో 2014లో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన ఈ ఆల్ రౌండర్ 6 వికెట్లు పడగొట్టాడు. 


భారత మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడిగా పరిచయమైన స్టువర్ట్ బిన్నీ.. అనతికాలంలోనే రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 79 మ్యాచులు ఆడిన బిన్నీ 9 శతకాలు, 17 శతకాలు నమోదుచేశాడు. టీమిండియా తరఫున 6 టెస్టులాడిన స్టువర్ట్ బిన్నీ 194 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 


Also Read: Paralympic 2020: సత్తా చాటిన భారత క్రీడాకారులు.. జావెలిన్ త్రోలో ఒకేరోజు రెండు పతకాలతో రికార్డు


వన్డేల్లో కాస్త పరవాలేదనిపించిన బిన్నీ ఏకంగా అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత బౌలర్‌గా నిలిచాడు. 14 వన్డేల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన బిన్నీ 6/4 బెస్ట్ బౌలింగ్ గణాంకలతో మొత్తం 20 వికెట్లు పడగొట్టాడు. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులకే 6 వికెట్లు తీయడం ద్వారా అనిల్ కుంబ్లే రికార్డును అధిగమించాడు. 2014లో టెస్టు, వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన బిన్నీ ఆ మరుసటి ఏడాదే చివరి మ్యాచ్ ఆడేశాడు. ఆపై బిన్నీకి జట్టు నుంచి అవకాశాలు రాలేదు. 2015లో టీమిండియా తరఫున టీ20ల్లో అరంగేట్రం చేసిన బిన్నీ 2016 తరువాత చోటు కోసం ఎదురుచూపులు తప్పలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్ నుంచి వైదొలగుతూ నిర్ణయం తీసుకున్నాడు. 


Also Read: India Wins Gold: పారాలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం.. చరిత్ర సృష్టించిన అవని లేఖరా 


‘ఫస్ట్ క్లాస్ క్రికెట్, అంతర్జాతీయ ఫార్మాట్ల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను. జాతీయ జట్టుకు ఆడటం చాలా గౌరవంగా భావించాను. టీమిండియాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించడాన్ని ఆస్వాదించానని’ టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్ మయాంతి లాంగర్‌ను 2012లో వివాహం చేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు.