పాఠశాల స్లాబు కూలి విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. మార్కాపురం మండలం రాజుపాలెంలో ప్రభుత్వ పాఠశాల భవనం స్లాబు కూలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యార్థి మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఆదివారం కావడంతో కొంతమంది విద్యార్థులు స్కూల్ లో ఆడుకునేందుకు వెళ్లారు. విద్యార్థులు ఆడుకుంటున్న సమయంలో శిథిలమైన భవనం పైకప్పు కూలింది. ఆ సమయంలో అక్కడ ఉన్న విష్ణువర్థన్ అనే విద్యార్థిపై శిథిలాలు పడి ప్రాణాలను కోల్పోయాడు.


Also Read: ప్రియుడి మోజులో రెండేళ్ల బిడ్డను చితకబాదిన తల్లి.. 250 ఆ వీడియోలు వైరల్.. ఈ కేసుపై సీఎం సీరియస్


చిన్నారి మృతి


ఆ పాఠశాల శిథిలావస్థకు చేరింది.  దీంతో ఆ పాఠశాలను ఎనిమిదేళ్ల క్రితమే మూసివేశారు. ప్రస్తుతం కొత్త భవనంలో తరగతులను నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరగవచ్చునని, ఆ శిథిల పాఠశాలను కూల్చివేయాలని స్థానికులు చాలాసార్లు అధికారులకు మొరపెట్టుకున్నారు. ఫలితంగా ఓ చిన్నారి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాజుపాలెంలో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. 


అధికారుల నిర్లక్ష్యం


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం రాజుపాలెం గ్రామానికి చెందిన పత్తి వెంకట నారాయణ, గాలెమ్మ దంపతుల పెద్ద కుమారుడు పత్తి విష్ణువర్ధన్‌ (10) మార్కాపురంలోని ఓ ప్రైవేటు స్కూలులో నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉన్న శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో ఆడుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో విష్ణువర్ధన్‌పై ఒక్కసారిగా శిథిల స్లాబు కూలింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాలుడిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కోటయ్య తెలిపారు. శిథిలమైన భవనాన్ని కూల్చివేయాలని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు, గ్రామస్థులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Also Read: Krishna Janmashtami 2021: మానవత్వంలో దైవత్వాన్ని చూపించిన కృష్ణావతారం.. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం కృష్ణతత్వం


ఆ భవనాలు కూల్చేయండి: మంత్రి


పాఠశాల శిథిలావస్థకు చేరిందన్న విషయాన్ని గ్రామస్థులు గతంలోనే తమ దృష్టికి తీసుకొచ్చారని ఎంఈవో తెలిపారు. పంచాయతీరాజ్‌శాఖ అనుమతి కోసం వేచిచూస్తున్నామని, అనుమతులు రాగానే భవనాన్ని తొలగిస్తామని తెలిపారు. రాష్ట్రంలో వినియోగంలో లేని శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ పాఠశాలలను కూల్చేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అధికారులను ఆదేశించారు. రాజుపాలెంలో బాలుడి మృతి చెందడంపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 


 


Also Read: AP Capital Issue: ఏపీ రాజధానిగా విశాఖ... క్లారిటీ ఇచ్చిన కేంద్రం... పొరపాటు సరిదిద్దుకున్నామని వివరణ