ఆనందతత్వం, ప్రేమతత్వం, స్నేహతత్వం, ప్రకృతితత్వం, నాయకత్వం ఇవన్నీ కలగలపితే శ్రీకృష్ణతత్వం. శ్రీ కృష్ణుడు జన్మించిన శ్రావణ బహుళ అష్టమిని కృష్ణాష్టమి పర్వదినంగా జరుపుకుంటాం. కన్నయ్య చిన్నప్పుడు గోకులంలో పెరగడం వల్ల గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడి జననం, ఆయన జీవితం అంతా ఓ అద్భుతం. యుగ యుగాలుగా ఆయన తత్వం, ఆయన జీవితం ఆదర్శం. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారమే ఇది.




రాజ్యాన్ని పాలించాలనే  కాంక్షతో మధురను పాలించే తండ్రి ఉగ్రసేనుడిని కారాగారంలో బంధించి అధికారం చేజిక్కించుకుంటాడు కంసుడు. సోదరి అంటే మాత్రం అంతులేని ప్రేమ. ఎంత ప్రేమంటే… దేవకిని యాదవ రాజైన వసుదేవుడికిచ్చి వివాహం చేసిన కంసుడు అత్తవారింటికి సాగనంపేటప్పుడు స్వయంగా రథం నడుపుతాడు. మార్గమధ్యలో ఉండగా…ఆకాశవాణి పిలుపు వినిపిస్తుంది. ‘ఓ కంసా! నీ సోదరికి పెళ్లిచేసి దగ్గరుండి మరీ సాగనంపుతున్నావు. కానీ నీ సోదరి కడుపున పుట్టిన ఎనిమిదో సంతానమే నీ ప్రాణం తీస్తుందని పలుకుతుంది. దీంతో ఉగ్రరూపుడైన కంసుడు..సోదరిపై ఉన్న ప్రేమంతా పగగా మారిపోతుంది. ఆమె అష్టమ సంతానం నన్నుచంపుతుందా… నేను ఇప్పుడే దేవకిని చంపేస్తే అదెలా సాధ్యమవుతుందని కత్తి పైకెత్తుతాడు.




అప్పటివరకూ కంసుడి కళ్లలో తన భార్యపై అంతులేని ప్రేమను చూసిన వసుదేవుడు…ఉన్నపాటుగా చంపేంత పగని చూసి హుతాశుడవుతాడు. వెంటనే కాళ్లపై పడి దేవకిని చంపొద్దని వేడుకుంటాడు. ఆమె ఎనిమిదో సంతానమే కదా నిన్ను చంపేది..అయితే పుట్టిన పిల్లలు అందర్నీ ఇచ్చేస్తానని కంసుడితో ఒప్పందం కుదుర్చుకుంటాడు వసుదేవుడు. అప్పటికి కాస్త ఆవేశం తగ్గడంతో చెల్లెల్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో గుర్తొచ్చి చంపకుండా వదిలిపెట్టి గృహనిర్బంధంలో ఉంచుతాడు. అప్పటి నుంచి దేవకి-వసుదేవులకు పుట్టిన సంతానాన్ని చంపుతూ వస్తుంటాడు. ఏడుగురి వంతు అయిపోయింది.




అష్టమ సంతానం భూమ్మీదపడే సమయం ఆసన్నమైంది. ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షం. అప్పటి కప్పుడు ఓ అద్భుతం జరిగింది. కారాగారం తలుపులు వాటంతట అవే తెరుచుకున్నాయి. కాపలావాళ్లని మత్తు ఆవహిస్తుంది. వసుదేవుడి సంకెళ్లు తెగిపోతాయి. ఇదంతా దైవలీల అని దేవకీ వసుదేవులకు అర్థమవుతుంది. అష్టమ సంతానం భూమ్మీద పడిన వెంటనే..ఎవరో మార్గ దర్శకత్వం చేసినట్టు వసుదేవుడు ఆ బిడ్డను ఎత్తుకుని యమునా నదివైపుకు నడుస్తాడు. ఎటు చూసినా వరదనీరు, ఎదురుగా నది..కానీ వసుదేవుడు నదిమధ్యనుంచి అలా సాగిపోతాడు.


హోరున వానలో తన స్నేహితుడు నందుడి ఇంటికి చేరుకుంటాడు. యశోద అప్పుడే ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది. ఆమె స్పృహలో ఉండకపోవడంతో కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టి..ఆ ఆడపిల్లను తిరిగి కారాగారానికి వచ్చేస్తాడు. కారాగారంలో దేవకి పొత్తిళ్లలో చేరగానే ఆ బిడ్డ ఏడుపు వినిపిస్తుంది. కాపలావాళ్లు అప్పుడే మేల్కొని కంసుడికి వార్త చేరవేస్తారు. వెంటనే అక్కడకు చేరుకున్న కంసుడు…తనను చంపబోయేది ఆడపిల్లా.. ఇది నిజమేనా అని కాపలా వాళ్లని ప్రశ్నిస్తాడు. అవునని ఆడపిల్లనే చూశామని చెబుతారు. అదే సమయంలో దేవకి వసుదేవులు కూడా వేడుకుంటారు…మగపిల్లడైతే చంపేవాడేమో ఆడపిల్ల కదా వదిలెయమని. కానీ కరుణించని కంసుడు ఆ చిన్నారిని చంపేందుకు ప్రత్నించగా ఆమె మాయమవుతుంది. నిన్ను చంపేవాడు పెరుగుతున్నాడనే మాటలు వినిపిస్తాయి. అప్పటి నుంచీ కృష్ణుడిని అంతం చేయడానికి కంసుడు చేయని ప్రయత్నం లేదు.




దిక్కుతోచని స్థితిలో ఊరూరు వెతికించాడు, దొరికిన ప్రతి శిశువునూ ఖండ ఖండాలుగా నరికి చంపాడు. ఎంతోమంది రాక్షసులను బాలకృష్ణుడుని సంహరించడానికి పంపాడు. కానీ వారంతా బాలకృసష్ణుడి చేతిలో చనిపోతారు.  ఆ తర్వాత కంసుడు మల్ల యుద్ధంలో ఆరితేరిన యోధుల్ని దించుతాడు. వారిని కూడా బలరామకృష్ణులు భీకరంగా ఎదుర్కోవడమే కాకుండా ప్రాణాలు తీసేస్తారు. అప్పటికి కంసుడికి అర్థమవుతుంది..తన ప్రాణం పోవడం తథ్యం అని. అలాంటి పరిస్థితుల్లో ఉన్న కంసుడిని జుట్టు పట్టుకుని సింహాసనం మీది నుంచి కిందికి తోసి క్షణాల్లో తలనరిక కంస సంహారం చేశాడని పురాణాల్లో చెబుతారు.


మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం : పుట్టింది రాజుకే అయినా గోకులంలో సాధారణ గోవుల కాపరిలానే పెరిగాడు కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక మానవ జీవన అనుభవసారం. మూర్తీభవించిన వ్యక్తిత్వ వికాసం. కన్నయ్య రూపం నల్లనిదైనా ఆయన మనసు వెన్నపూసంత తెల్లనిది. దేనికీభయపడని వ్యక్తిత్వం, నమ్మిన వారికి కొండంత అండనిచ్చే మనస్తత్వం. హిందూ పురాణాల్ను, తాత్త్విక గ్రంథాల్ను, జనబాహుళ్యంలో ఉన్న కథల్లో, సాహిత్యంలో,  పూజా సాంప్రదాయాల్లో కృష్ణుడి గురించి ఎన్నో విధాలుగా చెప్పుకుంటారు. చిలిపి కృష్ణుడిగా, పశువులకాపరిగా, రాధా గోపికా మనోహరునిగా, రుక్మిణీ సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగా, గోపికల మనసు దొచుకున్నవాడిగా, యాదవరాజుగా, పాండవ పక్షపాతిగా, భగవద్గీతా ప్రబోధకునిగా, తత్త్వోపదేశకునిగా, దేవదేవునిగా, చారిత్రిక రాజనీతిజ్ఞునిగా ఇలా ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించారు. ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో…



జ్ఞానానికి సంకేతం వెన్న: శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పది. బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు. వెన్న ముద్దలు ఎక్కువ, ఇష్టంగా తినేవాడు. వెన్న జ్ఞానానికి సంకేతం. వెన్న నల్లని కుండలలో ఉండేది. అంటే అజ్ఞానికి సంకేతం నల్లని కుండ, వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న. తన భక్తుల మనసులోని ఆజ్ఞానమనే చీకటిని తోలగించి, జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు.


కృష్ణతత్వం ఎందుకు ఇష్టపడతారు: కృష్ణ తత్వం గురించి తెలిసిన వారికి నిజమైన ప్రేమ తత్వం అంటే ఏంటో తెలుస్తుంది. గోపాలుడు ఎక్కడా మహిళలతో పరుషంగా మాట్లాడినట్లు లేదు. రుక్మిణి దేవి ఆరాధనను, సత్యభామ గడసరి తనం అన్నంటినీ స్వీకరించాడు. ప్రజల దృష్టిలో వీరుడు, ధీరుడు, మహా దేవుడు అయినా ఏ ప్రత్యేకతా లేకుండా ఇంట్లో అత్యంత సాధారణంగా ఉండడం పరమాత్మకే చెల్లింది.


ఏడు వర్ణాల సమాహారం నెమలి ఫించం: నెమలి పింఛంలో ఏడు రంగులు ఉంటాయి. ప్రకృతిలో కనిపించే రంగులన్నీ ఈ ఏడు వర్ణాల సమాహారమే. లోకమంతా విస్తరించి ఉన్న ఆకాశం పగటి వేళ నీలవర్ణంతో, రాత్రివేళల్లో నల్లని వర్ణంతో ప్రకాశిస్తుంది. సూర్యోదయంలో ఒక రంగు, సూర్యాస్తమయంలో మరొక రంగు కనిపిస్తుంది. ఈ రంగులన్నీ కాలానికి సంకేతం. కృష్ణపక్షం, శుక్లపక్షం అనే విభాగాలుగా చూసినా, కాలమంతా రంగులమయంగా కనిపిస్తుంది. ఇవన్నీ నెమలి పింఛంలో కనిపిస్తాయి. ఆ కాలానికి ప్రతీకగా శ్రీకృష్ణుడు నెమలి పించాన్ని ధరిస్తాడని చెబుతారు.




వేణుమాధవుడు: వేణువు, మాధవుల అనుబంధం ఎంత గొప్పదంటే...చివరకు గోపికలు కూడా వేణువును చూసి అసూయపొందారు. కన్నయ్య తమ కన్నా వేణువునే ఎక్కువగా ఆదరిస్తున్నాడని అలిగారు. వాళ్ళంతా కలిసి వేణువుని అడిగితే ఇలా అందట... ‘నన్ను నేను గోపయ్యకు అర్పించుకున్నాను. నాలో ఏమీ లేదు. అంతా డొల్ల’ అంది. నిజమే! వేణువు అంతా శూన్యం. అంటే, పరిపూర్ణతకు చిహ్నం. నేను, నాది అనే భావాలు వేణువుకు లేవు. ఏది తనదో అదే పరమాత్మకు ఇచ్చేసింది. ఇప్పుడిక వేణువు, మాధవుడు ఇద్దరు కాదు... వేణుమాధవుడు మాత్రమే. మానవుడు అందుకోవాల్సిన మహత్తరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని వేణువు అందిస్తుంది.


కృష్ణమేఘం: ఏ చిత్రాన్ని చూసినా, ఏ శిల్పాన్ని పరికించినా – కృష్ణుని సమ్మోహన దరహాసమే. ఉట్టిమీది పాలమీగడలు దొంగిలిస్తున్నప్పుడూ, అంతెత్తు గోవర్ధనగిరిని అమాంతంగా ఎత్తిపట్టుకున్నప్పుడూ, కాళీయ మర్థనం చేస్తున్నప్పుడు, కంసచాణూరాది రాక్షసుల్ని వధిస్తున్నప్పుడూ,  అర్జునుడికి గీతాబోధ చేస్తున్నప్పుడూ..ఇలా సందర్భం ఏదైనా కృష్ణుడి మొహం మీద చిరునవ్వు చెదరలేదు. వ్యాసమహర్షి శ్రీభాగవతంలో రుతువర్ణన చేస్తూ...‘కృష్ణమేఘం’ అన్న మాట వాడారు. ఆ మేఘం వెంట వచ్చే మెరుపు కృష్ణయ్య చిరునవ్వేనట!


అందుకే మధురాధిపతే అఖిలం మధురం! కృష్ణుడు మధురకే కాదు,  ప్రేమ మాధుర్యానికీ అధిపతి.