టోక్యో పారాలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. సోమవారం భారత క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబర్చి పతకాలను సొంతం చేసుకున్నారు. ఇవాళ ఏకంగా నలుగురు క్రీడాకారులు పతకాలతో మెరిశారు. జావెలిన్‌ త్రో ఎఫ్‌ 46 విభాగంలో భారత్‌కు ఏకంగా రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం సొంతం చేసుకోగా.. సుందర్‌ సింగ్‌ గుర్జార్‌ కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. డిస్కస్‌త్రో ఎఫ్‌ 56 విభాగంలో యోగేశ్‌ కతునియా రజత పతకం సొంతం చేసుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ విభాగంలో ఇప్పటికే అవని లేఖరా స్వర్ణం సాధించిన సంగతి తెలిసిందే.


డిస్కస్‌త్రో ఎఫ్‌ 56 విభాగంలో యోగేశ్‌ కతునియా రజతం సొంతం చేసుకున్నాడు. ఈ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన క్లాడినే బటిస్టా 45.59 మీటర్లు డిస్క్‌ను విసిరి బంగారు పతకం సాధించగా.. యోగేశ్‌ కతునియా 44.38 మీటర్లు విసిరి సిల్వర్ మెడల్‌ గెల్చుకున్నాడు. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో షూటర్‌ అవని లేఖరా స్వర్ణం సాధించగా.. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా ఆమె రికార్డులకెక్కింది. కాగా, టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరింది. ఇందులో ఓ స్వర్ణం, మూడు రజత పతకాలు ఉన్నాయి. ఆదివారం హైజంప్‌లో నిషాద్‌, టేబుల్‌ టెన్నిస్‌లో భవీనా బెన్‌ సిల్వర్ మెడల్స్ సాధించిన విషయం తెలిసిందే.