టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌ను నాలుగు పతకం వరించింది. అయితే, ఈ పతకం ఎంతో ప్రత్యేకమైనది కావడం విశేషం. షూటింగ్ విభాగంలో అవని లేఖరా బంగారు పతకం సాధించింది. అయితే, పారాలింపిక్స్‌లో ఓ భారత మహిళ బంగారు పతకం సాధించడం ఇదే తొలిసారి. సోమవారం తెల్లవారు జామున జరిగిన మ్యాచ్‌లో అవని లేఖరా బంగారు పతకం గెలిచి.. పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పింది.


అవని లేఖరా జైపూర్‌కు చెందిన వారు. ఈమె వయసు పందొమ్మిదేళ్లు. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న అతి చిన్న వయస్కురాల్లో ఈమె ఒకరు. అవనికి పదేళ్లు ఉన్నప్పుడు 2012లో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆమె వెన్ను విరిగిపోయింది. నడుము కింద భాగం చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది. ఎన్నో సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లు చేసినా ఫలితం లేకపోయింది. 


ఆమె మనసు మళ్లేందుకు ఏదైనా రంగంలో పట్టు సాధించాలనుకొని ఆమె తండ్రి ఆర్చరీ, షూటింగ్‌ రేంజ్‌లకు తీసుకెళ్లేవారు. అంతే, అప్పటి నుంచి శిక్షణ తీసుకున్న మొదటి ఏడాదే జాతీయ ఛాంపియన్‌ షిప్‌ పోటీల్లో మూడు పతకాలు గెల్చుకుంది. కరోనా కారణంగా గతేడాదిగా ఫిజియోథెరపీ సెషన్‌లు ప్రభావితమైనా, సరైన శిక్షణ లేకపోయినా ఇంటి దగ్గరే సాధన చేసి పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుంది.






అవని లేఖరా పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం పట్ల ప్రధాని మోదీ అభినందించారు. ఆమె అసాధారణ పర్ఫామెన్స్ అద్భుతమని ప్రశంసించారు. ఆమెకు అర్హత కలిగిన స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నందుకు అభినందించారు. సాధన చేయడంలో పడ్డ శ్రమ, పట్టుదల, షూటింగ్ పట్ల ఉన్న ఇష్టం వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ‘‘భారతీయ క్రీడా ప్రపంచానికి ఇది నిజంగా ప్రత్యేక క్షణం. మీ భవిష్యత్తు ప్రయత్నాలకు శుభాకాంక్షలు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.






అవని లేఖరా స్వర్ణం సాధించినందుకు భారత పారాలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ దీపా మలిక్ కూడా అభినందించారు. పారాలింపిక్స్‌లో బంగారు పతకం గెలిచిన తొలి భారత మహిళగా రికార్డు నెలకొల్పినందుకు ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.