USA’s Noah Lyles wins men’s 100-metre Olympic gold in photo finish: కోట్లాదిమంది ఊపిరి బిగపట్టిన వేళ.. కంటిరెప్ప ఆర్పకుండా ఉత్కంఠగా చూస్తున్న సమయాన... ఒలింపిక్స్ వంద మీటర్ల పరుగులో కొత్త ఛాంపియన్ పుట్టుకొచ్చాడు. వరల్డ్ ఫాస్టెస్ట్ మ్యాన్ ఎవరో తేలిపోయింది. వంద మీటర్ల ప్రతీ మిల్లీ సెకన్ ఎందుకు అంత విలువైందో చాటి చెప్తూ అమెరికా(USA) అథ్లెట్ నోవా లైల్స్(Noah Lyles) స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఈ స్వర్ణంతో ప్రపంచంలో అత్యంత వేగవంతమైన రన్నర్ తానేనని క్రీడా ప్రపంచానికి చాటి చెప్పాడు. 9.79 సెకన్లలో నోవా లైల్స్ బంగారు పతకం గెలవగా సరిగ్గా 9.79 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నజమైకా రన్నర్ కిషేన్ థాంప్సన్ రజత పతాకాన్ని సాధించాడు. ఇద్దరి సమయం ఒక్కటే అయినా కేవలం మిల్లీ సెకన్ తేడాలో నోవా... తన పరుగును బంగారు మయం చేసుకున్నాడు. ఇక 9. 81 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన ఫ్రెడ్ కెర్లీ కాంస్య పతకాన్ని సాధించాడు.
ఊపిరి బిగపట్టిన ఆ పది క్షణాలు...
ఒలింపిక్స్‌లో అత్యంత ఆకర్షణీయ ఈవెంట్ ముగిసింది. కళ్లు విప్పార్చి చూసిన పోటీ పది క్షణాల్లో ముగిసిపోయింది. కానీ ఈ పది క్షణాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులు ఎవ్వరూ కనురెప్ప కూడా వేయలేదు. ఒలింపిక్స్‌లో వంద మీటర్ల పరుగులో విజేత ఎవరో తేలిపోయింది. ప్రపంచంలో అత్యంత వేగవంతమైన మనిషిని తానేనని అమెరికా స్ప్రింటర్ నోవా లైల్స్ తేల్చి చెప్పాడు. ఈ ఏడాది వంద మీటర్ల పరుగులో అత్యధిక వేగాన్ని నమోదు చేసిన నోవై లైల్స్... మరోసారి అద్భుతం చేశాడు. ఈ ఏడాది తాను నెలకొల్పిన 9.81 సెకన్ల సమయాన్ని బద్దలు కొడుతూ ఒలింపిక్స్‌లో కొత్త సమయాన్ని నమోదు చేసి స్వర్ణం సాధించాడు. 9.79 సెకన్లలో లక్ష్యాన్ని చేరిన నోవా స్వర్ణ పతకం సాధించాడు. 2021లో టోక్యో ఒలింపిక్స్‌లో 200 మీటర్ల పరుగులో కాంస్యం పతకం కొల్లగొట్టిన నోవా లైల్స్... ఈసారి మాత్రం వంద మీటర్ల పరుగులో వచ్చిన అవకాశాన్ని వదలలేదు. పరుగు ప్రారంభమైన తర్వాత కాస్త వెనకపడ్డ నోవా ఆ తర్వాత ముందుకు దూసుకొచ్చి వెంట్రుకవాసిలో జమైకా అథ్లెట్ థాంప్సన్‌ను అధిగమించి స్వర్ణాన్ని ఎగరేసుకుపోయాడు. రెండేళ్లుగా ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో 100, 200 మీటర్ల పరుగుల్లో నోవా లైల్స్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఇప్పటికే వంద మీటర్లు, 200 మీటర్ల పరుగులో ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న నోవాలైల్స్... ఇప్పుడు ఒలింపిక్ ఛాంపియన్‌గా కూడా నిలిచాడు.
కిషేన్ థాంప్సన్ వెంట్రుకవాసిలో...
జమైకా స్ప్రింటర్ కిషేన్ థాంప్సన్‌కు వంద మీటర్ల పరుగులో రజతం దక్కింది. థాంప్సన్ కూడా 9.79 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న మిల్లీ సెకన్ల తేడాతో రజతానికే పరిమతమయ్యాడు. .784 సెకనల్లో నోవా లైల్స్ స్వర్ణాన్ని గెలవగా థాంప్సన్ .789 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు. ఫొటో ఫినిష్‌లో నోవా లైల్స్ కాస్త ముందున్నట్లు తేలడంతో గోల్డ్ మెడల్ అతని ఖాతాలో పడింది. అమెరికాకే చెందిన మరో స్ప్రింటర్ ఫ్రెడ్ కెర్లీ.. 9.81 సెకన్లతో కాంస్యం గెలిచాడు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీకి చెందిన మార్సెల్ జాకబ్స్ 9.85 సెకన్లతో లక్ష్యాన్ని చేరి అయిదో స్థానంలో నిలిచాడు.