Novak Djokovic Wins Gold At Paris Olympics 2024 | పారిస్: విశ్వ క్రీడల్లో సెర్బియా స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ అద్భుతం చేశాడు. పారిస్ ఒలింపిక్స్ 2024 టెన్నిస్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడు జకోవిచ్. ఆదివారం రాత్రి జరిగిన ఉత్కంఠపోరులో అల్కరాజ్ పై విజయం సాధించాడు. వరల్డ్ నెంబర్ వన్ ర్యాంకర్ జకోవిచ్, వరల్డ్ నెంబర్ 2 అల్కరాజ్ పై 7-6 (7-3), 7-6 (7-2) తేడాతో ఫైనల్లో గెలుపొంది ఒలింపిక్స్ విజేతగా నిలిచాడు. జకోవిచ్ కు స్వర్ణం దక్కగా, రన్నరప్ గా నిలిచిన స్పెయిన్ ఆటగాడు అల్కరాజ్ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఒలింపిక్స్ స్వర్ణం నెగ్గడంతో జకోవిచ్ కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసుకున్న అత్యంత అరుదైన ఆటగాడిగా నిలిచాడు.
కెరీర్ లో చివరి ఒలింపిక్స్ ఆడుతున్న జకోవిచ్ స్వర్ణం సాధించాడు. ఇప్పటివరకూ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ గ్రాండ్ స్లామ్స్ నెగ్గిన సెర్బియా దిగ్గజం తాజాగా పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో విజయంతో కెరీర్ గోల్డెన్ స్లామ్ పూర్తి చేసుకున్నట్లయింది. 37 ఏళ్ల వయసులో తనకంటే పదిహేనేళ్లు చిన్నవాడైన యువ సంచలనంపై విజయం మాటలు కాదు. తోటి దిగ్గజాలు ఇదే వయసులో ఆడలేక రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా.. జకోవిచ్ మాత్రం గ్రాండ్ స్లామ్స్ నెగ్గుతూ సాగిపోతున్నాడు.
తొలి సెట్ లో స్పెయిన్ ప్లేయర్ అల్కరాజ్, సెర్బియా స్టార్ జకోవిచ్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. తొలి సెట్ ట్రై బ్రేకర్ కు వెళ్లగా తన అనుభవాన్ని ఉపయోగించి 7-3తో నెగ్గాడు. కీలకమైన రెండో సెట్ లోనూ అల్కరాజ్ పోరాడినా ఫలితం లేకపోయింది. వెటరన్ జకోవిచ్ తెలివిగా నెట్ వద్దకు పదే పదే వస్తూ ప్లేస్ మెంట్ షాట్లు ఆడుతూ అల్కరాజ్ ను కోర్టులో పరుగులు పెట్టించాడు. పలుమార్లు అల్కరాజ్ అసహనంతో రాకెట్ ను నేలకేసి కొట్టేద్దామా అన్నంత కసిగా కనిపించాడు. వయసురీత్యా జకోవిచ్ కాస్త తగ్గుతాడేమోనన్న భావనలో బరిలోకి దిగినట్లు కనిపించిన అల్కరాజ్ వేగంగా కదిలాడు. కానీ గ్రాండ్ స్లామ్స్ దిగ్గజం జకోవిచ్ తో అతడి ఆటలు సాగలేదు.
24 గ్రాండ్ స్లామ్స్ విజేత
కెరీర్‌లో 24 గ్రాండ్ స్లామ్స్ నెగ్గాడు జకోవిచ్. తన ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో ఉన్నాడు. అత్యధిక వారాల పాటు నెంబర్ వన్ గా నిలిచిన టెన్నిస్ ప్లేయర్ జకోవిచ్. ఒలింపిక్స్ లో గతంలో పతకం నెగ్గినా అది స్వర్ణం కాదు. 2008లో జరిగిన బీజింగ్ ఒలింపిక్స్ లో జకోవిచ్ కాంస్యం నెగ్గాడు. ఒలింపిక్స్ లలో స్వర్ణం నెగ్గిన ఆటగాడి చేతిలో జకోవిచ్ ఓటమి చెందుతూ వచ్చాడు. బీజింగ్ ఒలింపిక్స్ లో రఫెల్ నాదల్ చేతిలో, 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆండీ ముర్రే చేతిలో, టోక్యో ఒలింపిక్స్ లో అలెగ్జాండర్ జ్వెరెవ్ చేతిలో ఓటమిపాలయ్యాడు. తాజాగా పారిస్ ఒలింపిక్స్ సింగిల్స్ ఫైనల్లో అల్కరాజ్ పై నెగ్గి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
Also Read: Paris Olympics 2024: బ్రిటన్‌కు షాకిచ్చిన భారత్, పారిస్ ఒలింపిక్స్ సెమీఫైనల్స్ చేరిన హాకీ టీమ్