Sri Lanka win the 2nd ODI by 32 runs | కొలంబో: రెండో వన్డేలో శ్రీలంక సంచలనం నమోదు చేసింది. భారత్ తో తొలి వన్డే టై కాగా, రెండో వన్డే ఆతిథ్య శ్రీలంక సత్తా చాటింది. మరోవైపు మరో మ్యాచ్ లో భారత జట్టు తడబాటుకు లోనైంది. కొలంబో వేదికగా ఆదివారం (ఆగస్టు 4న) జరిగిన 2వ వన్డేలో శ్రీలంక 32 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 రన్స్ చేసి, భారత్ కు మోస్తరు టార్గెట్ ఇచ్చింది. కానీ టార్గెట్ ఛేజింగ్ లో మొదట అదరగొట్టిన టీమిండియా.. ఆపై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి 42.2 ఓవర్లలో 208 పరుగులకు ఆలౌటైంది. దాంతో మూడు వన్డేల సిరీస్ లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం (ఆగస్టు 7న) నిర్ణయాత్మక మూడో వన్డేలో రెండు జట్లు తేల్చుకోనున్నాయి.
అద్భుతమైన ఓపెనింగ్, ముగింపు వరస్ట్..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (64 పరుగులు; 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) సిరీస్‌లో రెండో హాఫ్ సెంచరీ చేయగా.. శుభ్‌మన్ గిల్ (35 పరుగులు; 44 బంతుల్లో 3 ఫోర్లు), ఆపై ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (44 పరుగులు; 44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఓ దశలో వంద పరుగులకు ఒక్క వికెట్ కోల్పోయిన భారత్ ఆపై లంక స్పిన్నర్ జెఫ్రి వాండర్సే విజృంభణతో కుప్పకూలింది.
శ్రీలంక మణికట్టు స్పిన్నర్ జెఫ్రి వాండర్స్ 33 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి భారత్ పతనాన్ని శాసించాడు. మొదట రోహిత్ శర్మ వాండర్స్ వేసిన 14వ ఓవర్లో షాట్ ఆడి నిశాంక క్యాచ్ తో ఔటయ్యాడు. స్లిప్ లో క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరాడు. శివం దుబే అదే ఓవర్లో డకౌట్ గా వెనుదిరిగాడు. ఆపై ఫామ్ లో లేని విరాట్ కోహ్లీ (14), శ్రేయస్ అయ్యర్ (7)లను ఎల్బీడబ్ల్యూగా వాండర్స్ ఔట్ చేశాడు. రాహుల్ డకౌట్ కావడంతో భారత్ సగం ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 150 రన్స్ చేసింది. అక్షర్ పటేల్ వికెట్ల పతనాన్ని అడ్డుకుని పరుగులు సాధించాడు. ఆపై వరుస ఓవర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ (15)ని అసలంక ఔట్ చేశాడు. అర్షదీప్ సింగ్ రనౌట్ కావడంతో భారత్ ఆలౌటైంది. 32 రన్స్ తేడాతో రెండో వన్డేలో లంక గెలుపొందింది.
రాణించిన లంక బ్యాటర్లు
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో అవిష్క ఫెర్నాండో (40 పరుగులు; 62 బంతుల్లో 5 ఫోర్లు), దునిత్ వెల్లలాగె (39; 35 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లు), కుశాల్ మెండిస్ (30 పరుగులు; 42 బంతుల్లో 3 ఫోర్లు), కమిందు మెండిస్ (40 పరుగులు; 44 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. ఒక్క లంక బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయకున్నా సమష్టిగా రాణించడంతో జట్టు 9 వికెట్ల నష్టానికి 240 రన్స్ చేసింది. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, సిరాజ్ తలో వికెట్ తీశారు.