Controversies in Olympic History: ఒలింపిక్ క్రీడల(Olympic Games) సంరంభం మరికొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది. ఈ విశ్వ క్రీడల్లో పతకం సాధించడం ప్రతీ అథ్లెట్ జీవితకాల కల. అయితే క్రీడా కుంభమేళాను ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. గత చరిత్రను గమనిస్తే వీటన్నింటినీ అధిగమించి ఒలింపిక్స్ క్రీడలు... ముందుకు వెళ్లాయి. ఎన్నో వివాదాలు.. ఉగ్రవాదుల హెచ్చరికలు.. కుంభకోణాలు ఈ క్రీడలను చుట్టుముట్టినా క్రీడా స్ఫూర్తిని చాటుతూ ఈ విశ్వ క్రీడలు సగర్వంగా నిలిచాయి. ప్రపంచ యుద్ధాలు, అథ్లెట్ల హత్యలకు ఒలింపిక్స్ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది. విశ్వక్రీడలకు గ్రహణం పట్టేలా చేసేలా కొన్ని వివాదాలు చుట్టుముట్టినా వాటిని పటాపంచలు చేస్తూ విశ్వక్రీడలు వెలుగుతూనే ఉన్నాయి. ఎన్ని ప్రతికూలతలు, సమస్యలు ఉన్నా ఒలింపిక్ క్రీడలు తమ వైభవాన్ని కోల్పోలేదు. అయితే ఒలింపిక్స్‌ను చుట్టుముట్టిన వివాదాలను చరిత్ర పుటల్లోకి ఓసారి వెళ్లి పరిశీలిద్దాం...
తొలి వివాదం డ్రగ్స్(Drugs)
1896లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభమైన తర్వాత చిన్నచిన్న సమస్యలు వచ్చినా అతిపెద్ద సమస్యను గుర్తించింది మాత్రం 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో. తమ ప్రదర్శన మెరుగుపర్చుకునేందుకు అథ్లెట్లు తొలిసారి డ్రగ్స్ వినియోగించినట్లు గుర్తించింది ఈ ఒలింపిక్స్‌లోనే. స్వీడన్ అథ్లెట్ హన్స్ గున్నార్ లిల్జెన్‌వాల్...... పెంటాథ్లాన్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అయితే అతను రెండు బీర్లు తాగిన తర్వాత ఈ ఈ ఈవెంట్‌లో పాల్గొన్నట్లు తేలింది. బీర్ తాగడం వల్ల నాడీ వ్యవస్థ మెరుగ్గా పనిచేసిందని గుర్తించారు.
డ్రగ్స్ తీసుకుని అథ్లెట్ మరణం
1960 రోమ్ ఒలింపిక్స్‌లో డెన్మార్క్ సైక్లిస్ట్ నడ్ ఎనెమార్క్ జెన్సన్ సైకిల్ తొక్కుతూ అకస్మాత్తుగా కింద పడిపోయి మరణించాడు. తర్వాత విచారణలో జెన్సన్... నూడ్ యాంఫెటమైన్ అనే డ్రగ్స్ వాడినట్లు తేలింది. ఈ డ్రగ్స్ వాడకం వల్లే జెన్సన్ రేస్‌లో అపస్మారక స్థితికి చేరుకుని మృతి చెందాడని తేల్చారు.
జర్మనీ జట్టంతా డ్రగ్స్ వాడారట
1980లో జర్మనీ అథ్లెట్లు డ్రగ్స్‌ను అధికంగా వాడినట్లు గుర్తించారు. జర్మన్ మహిళా స్విమ్మర్లు 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ క్రీడల్లో స్టెరాయిడ్లను విచ్చలవిడిగా వాడారు. జర్మన్ స్విమ్మింగ్ జట్టు ఆ ఒలింపిక్స్‌లో 11 ఈవెంట్లలో బంగారు పతకాలను గెలుచుకుంది. తర్వాత జరిగిన విచారణలో జర్మన్ అథ్లెట్ స్టెరాయిడ్లను ఉపయోగించినట్లు తేల్చారు. ఆ ఒలింపిక్స్ సమయంలో దాదాపు 9 వేల మంది అథ్లెట్లు ఈ డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు.
స్వర్ణం దక్కినా...
1988 సియోల్ ఒలింపిక్స్‌లో కెనడియన్ స్ప్రింటర్ బెన్ జాన్సన్ పురుషుల 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం గెలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అయితే జాన్సన్ డ్రగ్స్ వాడినట్లు తేలింది. దీంతో అతడి స్వర్ణాన్ని వెనక్కి తీసుకున్నారు. రెండో స్థానంలో నిలిచిన అమెరికాకు చెందిన కార్ల్ లూయిస్‌కు ఆ బంగారు పతాకాన్ని అందజేశారు. ఇలా వరుసగా అథ్లెట్లు డ్రగ్స్ వాడుతున్నట్లు తేలడంతో 1999లో ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థను స్థాపించారు.
బరితెగించిన రష్యా అథ్లెట్లు
2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడల్లో రష్యా అద్భుత ప్రదర్శన చేసింది. 24 బంగారు పతకాలతో సహా మొత్తం 60 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. రష్యన్ అథ్లెట్ల నమూనాలను పరీక్షించగా 19 మంది ఆటగాళ్లు దోషులుగా తేలారు. వారిలో 14 మంది అథ్లెట్లు బంగారు పతకాలు సాధించడం విశేషం. 150 మందికి పైగా రష్యన్ అథ్లెట్లు డోపింగ్‌లో పాల్గొన్నారని తేలింది. ఒలింపిక్ చరిత్రలో ఒకే దేశానికి చెందిన 150 మంది అథ్లెట్లు డోపింగ్‌లో పట్టుబడడం అదే తొలిసారి. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ 2019లో రష్యాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది.
ఒలింపిక్ గేమ్స్ బహిష్కరణ
1896 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ చాలా దేశాలు ఒలింపిక్స్‌ను బహిష్కరించాయి. 1980లో అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్‌పై దాడి చేసింది. ఈ కారణంగా రష్యాలోని మాస్కో నగరంలో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను అమెరికా సహా 65 దేశాలు బహిష్కరించాయి. మొత్తం 67 దేశాలు ఆ ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనలేదు. ఐర్లాండ్ ఒలింపిక్ కౌన్సిల్ 1936 జర్మనీలో జరిగిన బెర్లిన్ ఒలింపిక్స్‌ను బహిష్కరించింది. మెల్‌బోర్న్ ఒలింపిక్స్‌ను నెదర్లాండ్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్ బహిష్కరించాయి.
ఆరంభంలో ఒక్కరూ లేరు
1896 ఒలింపిక్ క్రీడల్లో అసలు మహిళలు పాల్గొనలేదు. అయితే 1900 పారిస్ ఒలింపిక్స్‌లో మహిళలు టెన్నిస్, సెయిలింగ్, క్రోకెట్, గుర్రపు స్వారీ, గోల్ఫ్ గేమ్స్‌లో తొలిసారి పాల్గొన్నారు. 1900 పారిస్ ఒలింపిక్స్‌లో మొత్తం 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పుడు 997 మంది పురుష అథ్లెట్లు పాల్గొన్నారు. పురుషులతో పోలిస్తే ఇది కేవలం 2.2 శాతమే. అయితే 2012 లండన్ ఒలింపిక్ గేమ్స్‌లో దాదాపు 50 శాతం మంది మహిళలు క్రీడల్లో పాల్గొన్నారు. ఇప్పుడు జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో రికార్డు స్థాయిలో 50 శాతం మంది మహిళలు పాల్గొంటున్నారు.
ప్రపంచ యుద్ధాల ప్రభావం
1896లో ప్రారంభమైన ఆధునిక ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. యుద్ధాల కారణంగా ఒలింపిక్స్ మూడుసార్లు రద్దు చేయబడ్డాయి. 1916లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించలేదు. 1940- 1944 సంవత్సరాల్లో రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా ఒలింపిక్ క్రీడలు నిర్వహించలేదు.
ఇజ్రాయెల్ జట్టుపై ఉగ్రవాద దాడి
1972లో జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో ఒలింపిక్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఒలింపిక్స్‌లో ఉగ్రవాదుల రక్తపాతం జరిగింది ఈ ఒలిపింక్స్‌లోనే. సెప్టెంబర్ 5న బ్లాక్ సెప్టెంబర్ అనే ముష్కర సంస్థకు చెందిన ఎనిమిది మంది పాలస్తీనా ఉగ్రవాదులు... ఇజ్రాయెల్ జట్టులోని ఇద్దరు అథ్లెట్లను హత్య చేసి తొమ్మిది మందిని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ తొమ్మిది మంది ఇజ్రాయిలీలను కూడా చంపేశారు. ఈ ఘాతుకంతో ఒలింపిక్ క్రీడలను 34 గంటల పాటు నిలిపేశారు. అయితే IOC ప్రెసిడెంట్ అవేరీ బ్రుండేజ్ ఒత్తిడితో ఆటలను తిరిగి ఆరంభించారు. తరువాత కూడా ఒలింపిక్ క్రీడలకు ఉగ్రవాదుల నుంచి అనేక బెదిరింపులు వచ్చినా IOC పటిష్ట భద్రతతో ఉగ్ర మూకల ఆటలు కట్టించి... విశ్వ క్రీడలను ఆటలను నిర్వహించింది.