The history of Olympic rings: క్రీడల మహా కుంభమేళాకు సమయం ఆసన్నమవుతోంది. మరో వారం రోజుల్లో  ఒలింపిక్స్‌(Olympic) క్రీడలు ఆరంభం కానున్నాయి. పదివేల మందికిపైగా అథ్లెట్లు తమ పతక కలను సాకారం చేసుకునేందుకు పారిస్‌కు పయనమవుతున్నారు. అయితే 1896లో ఒలింపిక్స్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఒలింపిక్‌ చిహ్నంగా అయిదు రింగులను ఉపయోగిస్తున్నారు. అయితే  ఈ ఒలింపిక్స్‌ రింగు(Olympic rings)లను ఎందుకు ఉపయోగిస్తారు... కేవలం అయిదు రంగులే ఉండేందుకు కారణాలేంటీ... వాటికి ఉన్న రంగులు దేనికి సంకేతమనే ప్రశ్నలు ఆసక్తిని రేపుతాయి. మరోసారి ఈ ఒలింపిక్స్‌ రింగుల కథ ఏంటో తెలుసుకుందాం... 

 

అయిదు రంగులు.. అయిదు ఖండాలు

ఒలింపిక్స్‌లో అయిదు రింగులను ఉపయోగిస్తారు. 1896లో విశ్వ క్రీడలు ప్రారంభమైనప్పటి నుంచి ఇలా అయిదు రింగులనే ఉపయోగిస్తున్నారు. అంటే శతాబ్ద కాలానికిపైగా ఇలా అయిదు రింగులనే వాడుతున్నారు. అయిదు రింగులను అయిదు ప్రత్యేక రంగులు ఉంటాయి. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగులతో అయిదు రింగులు ఒకదానితో మరొకటి కలిసిపోయి ఉంటాయి. ఈ ఒలింపిక్‌ రంగులను ఒలింపిక్‌ అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్‌ పియర్‌ డు కుబెర్టిన్ రూపొందించారు. ఈ ఒలింపిక్‌లోని అయిదు రింగులు ఈ ప్రపంచంలోని అయిదు ప్రధాన ఖండాలకు ప్రతీక. ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్‌, ఆస్ట్రేలియా  ఖండాలకు ప్రతీకగా అయిదు రింగులను రూపొందించారు.

ఈ ఒలింపిక్‌ చిహ్నంలోని అయిదు రింగులు ఒకే కొలతలో సమానంగా ఉంటాయి. ఈ ఒలింపిక్‌ రంగులన్నీ వెనకు తెల్లటి రంగులో వాటిపైన ఈ అయిదు రంగులతో ఒలింపిక్‌ రింగులు ఉంటాయి. ప్రతి దేశం సమగ్రతను కాపాడుకునేందుకు ఒలింపిక్‌ రంగులను సూచిస్తారు. ప్రతి ఆటగాడిని కూడా ఈ ఒలింపిక్ రింగులు ప్రతీకగా నిలుస్తాయి. ఈ ఒలింపిక్‌ రింగులు ఎడమ నుంచి కుడికి అనుసంధానించబడి ఉంటాయి. నీలం, నలుపు, ఎరుపు రింగులు పైన... పసుపు, ఆకుపచ్చ వలయాలు దిగువన ఉన్నాయి. ఒలింపిక్ చార్టర్, రూల్ 8 ప్రకారం ఈ అయిదు రింగులను ఒలింపిక్ చిహ్నంగా గుర్తించారు. ఒలింపిక్ ఉద్యమ స్ఫూర్తిని.. క్రీడా స్ఫూర్తికి ఈ ఒలింపిక్‌ రంగులు ప్రతీకగా నిలుస్తాయి. సాధారణంగా మనకు అయిదు రంగులే కనిపిస్తున్నా వెనక తెలుపు రంగు కూడా ఉంటుంది. అంటే ఈ అయిదు రంగులతో పాటు వెనక ఉన్న తెలుపు రంగుతో కలిసి ఒలింపిక్‌ రంగులు ఆరు ఉంటాయి.

 

విశ్వవ్యాప్త స్ఫూర్తికి సూచిక

ఒలింపిక్ చిహ్నం సమగ్రతను చాటేందుకు, క్రీడా స్ఫూర్తిని పంచేందుకు ప్రతీకగా భావిస్తారు.  ఒలింపిక్ రింగుల్లోని నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు రంగులు ఒలింపిక్‌ విశ్వవ్యాప్తతను సూచిస్తుంది. ఒలింపిక్ చిహ్నం, జెండా, నినాదం, గీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటితోపాటు ఒలింపిక్‌ టార్చ్‌ రన్‌ కూడా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అయితే వీటి వినియోగానికి సంబంధించిన అన్ని హక్కులు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి మాత్రమే చెందుతాయి. ఒలింపిక్ చిహ్నం, ఒలింపిక్‌కు సంబంధించిన ఏ ప్రాపర్టీలనైనా IOC ముందస్తు వ్రాతపూర్వక అనుమతి తీసుకున్న తర్వాతే ఉపయోగించాలి.