Rohan Bopanna Retirement: భారత టెన్నిస్‌ చరిత్రలో ఓ శకం ముగిసింది. సుదీర్ఘ కాలం పాటు భారత టెన్నిస్‌కు  పర్యాయపదంలా మారిన రోహన్‌ బోపన్న(Rohan Bopanna) తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించాడు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను ఆడేసినట్లు... పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics)లో ఓటమి తర్వాత బోపన్న ప్రకటించాడు. విశ్వ క్రీడల్లో శ్రీరామ్‌ బాలాజీతో కలిసి మెన్స్ డబుల్స్‌లో బరిలో దిగిన బోపన్న తొలి రౌండ్‌లోనే పరాయజం పాలయ్యాడు. బోపన్న-బాలాజీ జోడీ ఫ్రాన్స్‌కు చెందిన  మోన్‌ఫిల్స్‌-రోజర్‌ వాజెలిన్‌ జంట చేతిలో 7-5, 6-2 తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి తర్వాత టెన్నిస్‌కు గుడ్‌ బై చెప్తున్నట్లు 44 ఏళ్ల బోపన్న బోపన్న ప్రకటించేశాడు. 


దేశం తరఫున ఇదే తన చివరి మ్యాచ్‌ అని కూడా భావోద్వేగ ప్రకటన చేశాడు. జపాన్‌లో జరిగే 2026 ఆసియా క్రీడల నుంచి బోపన్న ముందే తప్పుకున్నట్లయింది. తాను భారత్‌కు ప్రాతినిత్యం వహించకపోయినా ATP టూర్ ఈవెంట్‌లలో ఇండియా తరపున బరిలో దిగుతానని బోపన్న ప్రకటించాడు. భారత్‌ తరఫున రిటైర్మెంట్‌ ప్రకటించినా ప్రొఫెషనల్‌ గ్రాండ్‌స్లామ్‌, ఏటీపీ టోర్నీలలో మాత్రం కొనసాగాలని భావిస్తున్నట్లు బోపన్న ప్రకటించాడు.

 

ఎక్కడ ఉన్నానో తెలిసింది...

ఇండియా తరపున ఇదే నా లాస్ట్‌ మ్యాచ్‌ అని ప్రకటించిన బోపన్న... ఒలింపిక్స్‌లో జరిగిన మ్యాచ్‌లో తాను ఏ స్థితిలో ఉన్నానో అర్థమైందని తెలిపాడు. సాధ్యమైనంత కాలం టెన్నిస్‌ను అస్వాదిస్తానని ప్రకటించాడు. 20 ఏళ్లపాటు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తానని కలలో కూడా అనుకోలేదన్న బోపన్న... 2002లో ప్రారంభమైన తన ప్రస్థానం ఇప్పటివరకూ కొనసాగడం గర్వంగా ఉందన్నాడు. 1996లో అట్లాంటా గేమ్స్‌లో లియాండర్ పేస్ టెన్నిస్‌లో కాంస్య పతకాన్ని సాధించాడు. అప్పటినుంచి ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం దక్కలేదు. బోపన్న 2016లో ఒలింపిక్‌ పతకం సాధించేలా కనపడ్డాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి బోపన్న నాలుగో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లో బోపన్నకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. ఇప్పటికే డేవిస్ కప్ నుంచి బోపన్న రిటైర్మెంట్ ప్రకటించాడు.

 

అవి మధుర క్షణాలు

పురుషుల డబుల్స్ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకోవడం, ప్రపంచ నంబర్ వన్‌గా నిలవడం తన కెరీర్‌లో మధుర క్షణాలనీ బోపన్న తెలిపాడు. 2010లో బ్రెజిల్‌తో జరిగిన డేవిస్‌కప్‌లో రికార్డో మెల్లోపై విజయం సాధించడం తన అత్యుత్తమ విజయాల్లో ఒకటని బోపన్న తెలిపాడు. ఆ విజయం కచ్చితంగా డేవిస్ కప్ చరిత్రలో అత్యుత్తమ విజయాల్లో ఒకటని అన్నాడు.  తన సుదీర్ఘ ప్రయాణంలో తన  భార్య సుప్రియ ఎన్నో త్యాగాలు చేసిందని.. ఆమెకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నట్లు బోపన్న వెల్లడించాడు.