Britains Adam Peaty tests positive | పారిస్ ఒలింపిక్స్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. పతకం నెగ్గిన ఓ స్విమ్మర్ కు కోవిడ్19 పాజిటివ్ గా తేలింది. ఆదివారం జరిగిన 100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో ఆడమ్ పీటి రెండో స్థానంలో నిలిచాడు. బ్రిటన్ స్టార్ స్విమ్మర్ పీటి రజత పతకం సాధించాడు. కానీ అతడికి జరిపిన కరోనా టెస్టుల్లో పాజిటివ్ గా తేలింది.
ఆదివారం జరిగిన 100 మీటర్ల స్విమ్మింగ్ బ్రెస్ట్ స్ట్రోక్ విభాగంలో తృటిలో స్వర్ణం చేజార్చుకున్నాడు బ్రిటన్ స్విమ్మ్ ఆడం పీటీ. కేవలం 0.02 సెకన్ల తేడాతో ఇటలీకి చెందిన నికోలో మార్టినెంఘి స్వర్ణ పతకం సాధించగా, రెండో స్థానంలో నిలిచిన బ్రిటన్ స్విమ్మర్ పీటీ, అమెరికా స్విమ్మర్ నిక్ ఫింక్ తో కలిసి రజతం షేర్ చేసుకున్నాడు. ఇద్దరూ ఒకే సమయంలో గమ్యాన్ని చేరుకోవడం తెలిసిందే. ఈవెంట్ ముగిసిన తరువాత ఆదివారం రాత్రి ఆడం పీటీ అస్వస్థతకు లోనైనట్లు కనిపించాడు. టెస్టులు చేయగా సోమవారం నాడు కరోనా పాజిటివ్ గా తేలినట్లు బ్రిటన్ అధికారులు వెల్లడించారు.
ఇదివరకే పారిస్ ఒలింపిక్స్ లో కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏదో చోట ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ గా తేలడం కలవరపెడుతోంది. కేవలం మూడు రోజులు అయింది, ఇంకా చాలా విభాగాల గేమ్స్ ప్రారంభానికి ముందే, కొందరు అథ్లెట్లు కరోనా వైరస్ బారిన పడుతున్నారు. ఆటగాళ్ల కోచ్‌లు, క్రీడా సంఘాలు ఈ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకితే ఆటగాళ్ల ప్రదర్శన స్థాయి తక్కువ అవుతుందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.