Manika Batra Becomes First Indian Table Tennis Player To Reach Pre-Quarterfinals: ఒలింపిక్స్‌లో ఉమెన్స్‌ టేబుల్‌ టెన్నీస్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ మనికా బాత్రా(Manika Batra ).. చరిత్ర సృష్టించింది. అద్భుత ఆటతీరుతో పతక ఆశలు రేపుతోంది. విశ్వ క్రీడల్లో 16వ రౌండ్‌కు చేరిన తొలి భారతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మనికా బాత్రా రికార్డు సృష్టించింది. భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఒలింపిక్స్‌లో రౌండ్‌ 16కు చేరుకోవడం ఇదే తొలిసారి. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన 29 ఏళ్ల మనికా బాత్రా... తనకంటే ఉన్నతమైన ర్యాంక్‌లో ఉన్న ఫ్రెంచ్ ప్లేయర్ ప్రితికా పవాడేపై 4-0 తేడాతో విజయం సాధించింది. రౌండ్‌ 32లో ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ 18వ ర్యాంక్‌ ప్లేయర్‌  ప్రితికా పవాడేపై 11-9, 11-6, 11-9, 11-7 తేడాతో బాత్రా సూపర్‌ విక్టరీ సాధించింది.

 

వరల్డ్‌ ర్యాంకింగ్‌లో 28వ ర్యాంక్‌లో ఉన్న మనికా... 18వ ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్‌పై విజయం సాధించి... ఆత్మవిశ్వాసాన్న ప్రోది చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచి దూకుడు విధానాన్ని అవలంభించిన మనికా బాత్రా... ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా 4-0 తేడాతో ప్రితికా పవాడేపై చిత్తు చేసింది. ఈ విజయంతో మనికా బాత్రా ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. మనికా ప్రీక్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ మియూ హిరానోతో కానీ... హాంకాంగ్‌కు చెందిన జు చెంగ్జూతో కానీ తలపడే అవకాశం ఉంది. 





 

పట్టు వదల్లేదు..

2021 టోక్యో ఒలింపిక్స్‌లో జరిగిన పురుషుల టేబుల్‌ టెన్నిస్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ ప్లేయర్‌ ఆచంట శరత్ కమల్ 32వ రౌండ్‌కు చేరుకున్నాడు. అదే ఇప్పటివరకూ ఒలింపిక్స్‌లో భారత అత్యుత్తమ ప్రదర్శన. దీనిని మనికా బాత్రా బద్దలు కొట్టింది. మనికా టోక్యో ఒలింపిక్స్‌లో 32వ రౌండ్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళగా నిలిచింది. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టింది. మనికా తన కెరీర్‌లోనే ఉత్తమ ప్రదర్శన చేసి ఆకట్టుకుంది. ఇదే ప్రదర్శనే కొనసాగిస్తే టేబుల్‌ టెన్నీస్‌లో భారత్‌కు తొలి పతకం దక్కే అవకాశం ఉంది. ఓ దశలో మనికా-ప్రితిక పవాడే స్కోరు 8-8తో సమంగా ఉంది. ఆ స మయంలో మనికా పట్టు వదలకుండా ఆడి సెట్‌ను కైవసం చేసుకోవడం ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

 


 

ప్రితిక వరుస తప్పిదాలు కూడా మణికికు కలిసివచ్చాయి. ఈ మ్యాచ్‌లో పుంజుకునేందుకు ప్రితిక అన్ని ప్రయత్నాలు చేసిన మనికా బాత్రా అసలు ఆ అవకాశమే ఇవ్వలేదు. మనిక మ్యాచ్‌పై పట్టును కొనసాగించింది, నాల్గో గేమ్‌లో మనికా ధాటికి ప్రితికా తేలిపోయింది. 11-7తో సునాయసంగా మనికా గెలిచింది. ఈ మ్యాచ్‌ను మణికా కేవలం 37 నిమిషాల్లోనే ముగించి ప్రీ క్వార్టర్స్‌కు చేరింది.