Controversy over PV Sindhus Saree: పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics 2024)లో భారత ఆటగాళ్లు లక్ పరీక్షించుకుంటున్నారు. పారిస్‌ వేదికగా అంగరంగ వైభవంగా జరిగిన విశ్వ క్రీడల ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్లు తళుకున్న మెరిశారు. సంప్రదాయ చీర కట్టులో భారత మహిళ అథ్లెట్లు... కుర్తా పైజామాతో పురుష అథ్లెట్లు నౌకలో ముందుకు సాగారు. బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ పతాకధారులుగా వ్యవహరించగా.. మిగిలిన అథ్లెట్లు వెనక నిల్చున్నారు. అయితే ఈ పరేడ్‌లో భారత ఆటగాళ్లు ధరించిన దుస్తులపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముంబై మార్కెట్‌లో 200 రూపాయలకు భారత ఆటగాళ్లు ధరించిన దుస్తులు కంటే మంచి వస్త్రాలు వస్తాయని ప్రముఖ రచయిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఇంతకంటే అవమానకరం ఏది లేదని ఆమె వ్యాఖ్యానించారు.

 

విమర్శల జడివాన

ఈ వేడుకల్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) సహా భారత మహిళ అథ్లెట్లు భారతీయ సంప్రదాయం ఒట్టిపడేలా తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించారు. పురుష అథ్లెట్లు కూడా కుర్తా పైజామాతో మెరిసిపోయారు. అయితే ఈ దుస్తులపై ఇప్పుడు విమర్శలు కురుస్తున్నాయి. భారత అథ్లెట్లు ధరించిన చీరపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియానీ( Tarun Tahilian) డిజైన్ చేసిన ఈ దుస్తులు చాలా చీప్ గా ఉన్నాయంటూ బెంగళూరుకు చెందిన ప్రముఖ రచయిత డాక్టర్ నందితా అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.

 

ప్రముఖ డిజైనర్‌ తరుణ్ తహిలియానీ చేసిన ఈ ఈవెంట్‌ వస్త్రాలు దారుణంగా ఉన్నాయని నందితా అయ్యర్‌ మండిపడ్డారు. ఈ యూనిఫామ్‌ కన్నా మెరుగైన చీరలు 200 రూపాయలకు ముంబై వీధుల్లో తాను చూశానని మండిపడ్డారు. చౌకైన పాలిస్టర్, ఇకత్‌ ప్రింట్‌తో భారత అథ్లెట్లు ధరించిన దుస్తులు చాలా దారుణంగా ఉన్నాయని అన్నారు. వీటిని కేవలం రెండు మూడు నిమిషాల్లోనే డిజైన్‌ చేసేశారా అని విమర్శలు చేశారు. సుసంపన్నమైన చేనేత సంస్కృతికి, చరిత్రకు ఇది ఘోరమైన అవమామని నందితా అయ్యర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 





 

సోషల్‌ మీడియాలోనూ విమర్శలు

భారత అథ్లెట్లు ధరించిన యూనిఫామ్‌పై  సోషల్‌ మీడియాలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. "హలో తరుణ్ తహిలియానీ!  ఈ 'డిజైన్‌ను మీరు ఎన్ని క్షణాల్లో ఖరారు చేశారని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. "టీమ్ ఇండియా అథ్లెట్లు ధరించిన దుస్తులు మరి పేలవంగా ఉన్నాయని విజయలక్ష్మి ఛబ్రా ఇన్‌ స్టా స్టోరీలో పోస్ట్‌ చేశారు. కేంద్ర జౌళి, చేనేత మంత్రిత్వ శాఖ ఏం చేస్తుందంటూ మరొకరు ప్రశ్నించారు. రాధిక మర్చంట్‌, గౌరీ ఖాన్ వారి పెళ్లి దుస్తులను తయారు చేసిన వ్యక్తే ఈ దుస్తులను తయారు చేశాడని.. ధనిక వర్గానికి ఒకలా... అథ్లెట్లకు మరోలా తయారు చేశాడని ఓ నెటిజన్ మండిపడ్డారు. తరుణ్‌ తహిలియానీ తన మేధస్సునంతా అంబానీ పెళ్లిలో వినియోగించాడని.. ఇక అతని వద్ద ఇంకేమీ మిగలలేదని మరో నెటిజన్‌ ఎ్దదేవా చేశాడు.