India Achieves Historic Feat Winning 29 Medals:  పారాలింపిక్స్‌(Paris Paralympics 2024)లో భారత్(India) పతకాల పంట పండిస్తోంది. ఇప్పటికే గత రికార్డులన్నింటినీ అధిగమించేసి... నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించేసింది. ఇక నిన్న ( శనివారం) భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. దీంతో భారత పతకాల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో ఏడు స్వర్ణాలు... తొమ్మిది రజతాలు, 13 కాంస్య పతకాలతో భారత్ పతకాల జాబితాలో పదహారో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకూ 17వ స్థానంలో  ఉన్న భారత్ జావెలిన్‌లో వచ్చిన పసిడి పతకంతో ఒక స్థానంపైకి ఎగబాకింది.  దీంతో 16వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. 
 

మెరిసిన నవదీప్

 పారా ఒలింపిక్స్‌  పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌-41 విభాగంలో .. భారత అథ్లెట్‌ నవదీప్‌(Navdeep) స్వర్ణ పతకంతో మెరిశాడు. ఈ పతకం అనూహ్యంగా భారత్‌ ఖాతాలో చేరింది. తొలుత ఇరాన్ అథ్లెట్‌ సదేఘ్ షాయ్ తొలుత స్వర్ణ పతకం సాధించాడు. భారత అథ్లెట్ నవదీప్ రజత పతకం సాధించాడు. అయితే ఇరాన్ అథ్లెట్ షాయ్‌పై అనూహ్యంగా వేటు పడింది. దీంతో రెండో స్థానంలో ఉన్న నవదీప్‌కు స్వర్ణ పతకం దక్కింది. జావెలిన్‌ త్రో ఎఫ్‌-41 ఈవెంట్‌ పసిడి పతకం గెలిచిన ఏకైక ఇండియన్ అథ్లెట్‌గా నవదీప్‌ చరిత్ర సృష్టించాడు. నవదీప్‌ రెండో ప్రయత్నంలో 46.39 మీటర్ల దూరం ఈటెను విరిశాడు. మూడో త్రోలో 47.32 మీటర్లు విసిరాడు. అయితే ఇరాన్‌కు చెందిన సదేగ్ షాయ్‌.. తన ఐదో ప్రయత్నంలో 47.64 మీటర్ల త్రో విసిరి పారాలింపిక్స్‌ రికార్డు సృష్టించి తొలుత  స్వర్ణం గెలిచాడు. అయితే పోటీ ముగిసిన తర్వాత ఒలింపిక్స్‌ నిర్వహక కమిటీ సదేగ్‌పై అనర్హత వేటు వేసింది. దీంతో నవదీప్ స్వర్ణ పతక విజేతగా నిలిచాడు. సన్ పెంగ్సియాంగ్ 44.72 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి రజత పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇరాక్‌కు చెందిన నుఖైలావి విల్డాన్ 40.46 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. మరుగుజ్జుల కోసం F41 విభాగంలో పారాలింపిక్స్‌లో పోటీలు నిర్వహిస్తారు. 



 

సిమ్రన్‌ శర్మకు కాంస్యం

మహిళల 200మీటర్ల టీ12 విభాగంలో భారత అథ్లెట్ సిమ్రన్‌(Simran) కాంస్య పతకం సాధించింది. మహిళల 200 మీటర్ల T12 ఈవెంట్‌లో సిమ్రన్ శర్మ 24.75 సెకన్లతో వ్యక్తిగత రికార్డును నెలకొల్పి మూడో స్థానంలో నిలిచింది. క్యూబాకు చెందిన ఒమారా డ్యూరాండ్ ఎలియాస్ 23.62 సెకన్లలో స్వర్ణం, వెనిజులాకు చెందిన అలెజాండ్రా పోలా పెరెజ్ లోపెజ్ 24.19 సెకన్లతో రజతం గెలుచుకున్నారు. పారాలింపిక్స్‌లో T12 విభాగం దృష్టి లోపం ఉన్న అథ్లెట్లకు నిర్వహిస్తారు. 

 

పతకాల పట్టికలో

పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 29కి పెరిగింది. ఇందులో ఏడు స్వర్ణాలు,  తొమ్మిది రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. భారత్ ప్రస్తుతం పతకాల పట్టికలో 16వ స్థానంలో ఉంది. 93 స్వర్ణాలతో సహా 215 పతకాలతో చైనా అగ్రస్థానంలో ఉంది. బ్రిటన్ 120 పతకాలతో రెండో స్థానంలో ఉండగా... అమెరికా 102 పతకాలతో మూడో స్థానంలో ఉంది.