RS 1 crore cash prize for Deepthi Jeevanji and Group 2 post and 500 sq yards | హైదరాబాద్: పారిస్ వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్ లో అద్భుతం చేసిన తెలంగాణ అథ్లెట్ దీప్తి జీవాంజిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. అథ్లెట్ దీప్తి జీవాంజి పారాలింపిక్స్ లో పాల్గొని కాంస్య పతకం సాధించి సత్తా చాటింది. ఇటీవల ఒలింపిక్స్ తరువాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. విశ్వవేదికపై సత్తాచాటే అథ్లెట్లు, ఆటగాళ్లను కచ్చితంగా గౌరవిస్తాం, వారు మరిన్ని విజయాలు సాధించేందుకు ప్రోత్సహిస్తామన్నారు.


చెప్పిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ తెలంగాణ అథ్లెట్ దీప్తిని మరింత ప్రోత్సహించేందుకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆమెకు రూ.1 కోటి నగదు బహుమతి సైతం ప్రకటించారు రేవంత్. దాంతో పాటుగా వరంగల్ లో 500 గజాల స్థలం ఇస్తామన్నారు. దీప్తి జీవాంజికి శిక్షణ ఇచ్చిన ఆమె కోచ్ రమేష్ కు రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పారాలింపిక్స్ లో పాల్గొనే వారికి మెరుగైన కోచింగ్, ఇతర ప్రోత్సాహం అందించే ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శాట్ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎంపీ బలరాం నాయక్,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


పారిస్‌ పారాలింపిక్స్‌ 2024లో తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజి 400 మీటర్ల టీ20 ఈవెంట్‌లో కాంస్య పతకం నెగ్గడం తెలిసిందే. పారిస్ నుంచి శుక్రవారం నగరానికి చేరుకున్న దీప్తికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. విశ్వవేదికలో పతకం నెగ్గి తిరిగొచ్చిన పారా అథ్లెట్ దీప్తి రాకతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కోలహలంగా మారింది. దేశానికి పతకం గెలవడం చాలా గర్వంగా ఉందని, ఆరోగ్యం బాగోలేకపోవడంతో స్వర్ణం నెగ్గలేకపోయానని తెలిపింది. వచ్చేసారి కచ్చితంగా స్వర్ణంతో తిరిగొస్తానని దీప్తి దీమా వ్యక్తం చేసింది. తొలి ప్రయత్నంలోనే పారా ఒలింపిక్స్ లో పతకం నెగ్గిన దీప్తిపై కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రశంసల జల్లులు కురిపించారు.