India's Historic Feat At Paris Paralympics 2024: భారత అథెట్లు సత్తా చాటారు. గత చరిత్రను తిరగరాశారు. అంతర్జాతీయ వేదికపై భారత సత్తాను మరోసారి సత్తా చాటారు. పారిస్ పారాలింపిక్స్‌లో(Paris Paralympics 2024) టార్గెట్ 25ను దాటేసింది. ఈ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శనతో గత రికార్డులన్నీ కాల గర్భంలో కలిసిపోయాయి. ఇక మిగిలింది కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడమే. ఈ విశ్వ క్రీడల్లో అవనీ లేఖరాతో ప్రారంభమైన భారత్ పతకాల వేట నిరాంటకంగా కొనసాగుతోంది. ఈ పారాలింపిక్స్‌లో భారత్ ఆరు పసిడి పతకాలు... 9 రజతాలు.. 12 కాంస్య పతకాలతో 27 పతకాలు సాధించి అబ్బురపరిచింది. టార్గెట్ 25 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత అథ్లెట్లు ఆ లక్ష్యాన్ని దాటి మరీ ముందుకు సాగుతున్నారు.
ఆ పోరాటం అనిర్వచనీయం..
పారిస్ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పోరాట స్ఫూర్తి ఎందరికో మార్గదర్శకంగా నిలిచింది. ఈ ఆటగాళ్లు తమ పోరాటంతో ఎందరికో స్ఫూర్తిని నింపారు. వైకల్యం తమ శరీరాలకే కానీ తమ పోరాట పటిమకు... అంకితభావానికి.. ఆత్మ విశ్వాసానికి కాదని ఘనంగా చాటి చెప్పారు. శారీరాక వైకల్యాలను తమ అద్భుత పోరాట స్ఫూర్తితో అధిగమించి పతక పంట పండిస్తున్నారు. వీరి పోరాటంతో పతకాల పట్టికలో భారత్ సగర్వంగా 17వ స్థానంలో నిలబడింది. ఇది చూడటానికి ఎక్కువగా కనిపిస్తున్నా గతంతో పోలిస్తే భారత స్థానం చాలా మెరుగుపడింది. ఈ పారాలింపిక్స్‌లో భారత్ ఇప్పటివరకూ భారత మొత్తం 27 పతకాలను సాధించింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 12 కాంస్య పతకాలున్నాయి. ఇప్పటివరకూ టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ మొత్తం 19 పతకాలను మాత్రమే గెలుచుకుని అత్యధిక పతకాలు సాధించిన రికార్డు ఉంది. ఈ రికార్డు పారిస్ పారాలింపిక్స్‌తో బద్దలైంది. టోక్యో పారా ఒలింపిక్స్‌లో భారత్ 5 స్వర్ణ పతకాలు సాధించగా.. ఈ పారిస్ పారాలింపిక్స్‌లో ఆ రికార్డు కూడా బద్దలైంది. భారత్ ఇప్పటికే ఆరు స్వర్ణాలు గెలుచుకుంది. అవనీ లఖేరా, నితేష్ కుమార్, సుమిత్, హర్విందర్ సింగ్, ధరంబీర్, ప్రవీణ్ కుమార్ భారత్‌కు స్వర్ణకాంతులు అందించారు.
Read Also : McCullum: ఇక ఊచకోతను మించి, మెకల్లమ్ రాకతో మారనున్న బ్యాటింగ్ తీరు
ప్రవీణ్‌కుమార్ మరోసారి...
పురుషుల హైజంప్ అథ్లెట్ ప్రవీణ్ కుమార్ భారత్‌కు గోల్డ్ మెడల్ అందించి తన పేరిట కొత్త రికార్డును లిఖించుకున్నాడు. టీ64 హైజంప్ విభాగంలో 2.08మీటర్ల ఎత్తు దూకిన ప్రవీణ్ పసిడిని ఒడిసిపట్టాడు. పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌కు వరుసగా ఇది రెండో పతకం కావడం విశేషం. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ప్రవీణ్.. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లోనూ సిల్వర్ మెడల్ సాధించి సత్తా చాటాడు. ఈసారి మరింత మెరుగైన ప్రదర్శన చేసి గోల్డ్‌ను సాధించేశాడు. అతిచిన్న వయసులోనే ఒలింపిక్ పతకం సాధించిన పారా అథ్లెట్‌గా టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవీణ్‌కుమార్ చరిత్ర సృష్టించాడు. పారాలింపిక్స్ హైజంప్ పోటీల్లో ఇండియాకు గోల్డ్ మెడల్ అందించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు మరియప్పన్ తంగవేలు ఈ పోటీల్లో స్వర్ణం సాధించాడు.