Nisha Dahiya injured in quarterfinals at Paris Olympics: అసలే ఒలింపిక్స్‌(Paris Olympics).. జరుగుతోంది ప్రీ క్వార్టర్‌ ఫైనల్‌... ఈసారి ఎలాగైనా పతకం సాధించాలన్న పట్టుదలతో భారత రెజ్లర్‌ నిషా దహియా(Nisha Dahiya) పోరాడుతోంది. ఇంకో 33 సెకన్లలో ఆట ముగియనుంది. అప్పటికే స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న నిషా దహియా.. విజయం ఖాయమనే అంతా భావించారు. అప్పుడే అనూహ్యఘటన జరిగింది. నిషా దహియా వేలికి గాయమైంది. అయినా నిషా పట్టు వదల్లేదు. పట్టి కట్టుకుని బరిలోనే నిలిచి పోరాడింది. ఆ తర్వాత కొన్ని క్షణాలకే ఆమె కుడి చేయికి కూడా గాయమైంది. నొప్పితో విలవిలలాడిపోయింది. తక్షణమే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆ నొప్పితో ఆమె తిరిగి పోరాడడం కష్టమేనని అంతా అనుకున్నారు. కానీ నిషా దహియా తిరిగి పోరాటం ఆరంభించింది. నొప్పి మెలిపెడుతున్నా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ధైర్యంగా తలపడింది. కాసేపటికే మళ్లీ తీవ్రమైన నొప్పితో నిషా సతమతమైంది. అయినా పోరాటం ఆపలేదు. నిషా దహియా చేతి నొప్పిని ఆసరగా తీసుకున్న ప్రత్యర్థి చెలరేగి విజయం సాధించింది. ఆ ఓటమిని జీర్ణించుకోలేక నిషా దహియా బోరుమని ఏడ్చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినా.... నొప్పి వేధిస్తున్నా నిషా దహియా చేసిన పోరాటం మాత్రం అభిమానులను అలరించింది.

 

మనసులను హత్తుకున్న పోరాటం 

రెజ్లింగ్‌ మహిళల 68 కేజీల ప్రిక్వార్టర్స్‌లో ఉత్తర కొరియా రెజ్లర్‌ పాక్‌ సోల్‌ గమ్‌తో భారత రెజ్లర్‌ నిషా దహియా పోరాడింది. ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే దూకుడు ప్రదర్శించిన నిషా 8-1తో స్పష్టమైన ఆధిక్యం సాధించి దాదాపుగా గెలుపు ఖాయం చేసుకుంది. ఇంకో 60 సెకన్లలో ఆట ముగిసిపోనుంది. ఆ కీలక సమయంలోనే నిశాకు వేలికి గాయమైంది. అయినా పట్టికట్టుకుని మరి పోటీ కొనసాగించిన నిషా 8-2తో ఆధిక్యాన్ని నిలెబట్టుకుంది. ఆ తర్వాత నిషాకు మరో గట్టి దెబ్బ తగిలింది. ఈసారి నిషా దహియా కుడి చేతికి గాయమైంది. తీవ్రమైన ఆ గాయంతో నిషా నొప్పి భరించలేకు కన్నీళ్లు పెట్టుకుంది. వైద్య చికిత్స తర్వాత ఒంటిచేత్తో పోరాటం కొనసాగించినా ఓటమి తప్పలేదు. 





 

సోషల్‌ మీడియా  షేక్‌

ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో ఓడిపోయినప్పటికీ గాయపడిన నిషా దహియా పోరాటం సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. పాక్ సోల్ గమ్‌ చేతిలో 8-10 తేడాతో ఓడిపోయినా నిషా అద్భుతంగా పోరాడిందంటూ  సోషల్‌ మీడియాలో నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. నిషా పోరాటం అద్భుతమని... ఆమె ఓ ఫైటర్‌ అని ఓ నెటిజన్‌ కామెంట్ చేశాడు. ఆమె మరణం అంచున ఉన్న పోరాడాలన్న స్ఫూర్తిని రగిలించిందని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ బౌట్ అసంపూర్తని.. నిబంధనలు చాలా కఠినమైనవని మరో నెటిజన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. నిషా దహియా ఒక ఫైటర్. త్వరగా కోలుకోండి ఛాంపియన్ అని మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు.