India vs Germany hockey, Paris 2024 Olympics semi-final: భారతలో హాకీకి(hockey) పునర్వైభవం తెచ్చేందుకు.. మా హాకీ అప్పుడు ఎంతో ఘనం అన్న మాటను మార్చి రాసేందుకు... కోట్లాదిమంది అభిమానుల ఆశలను తీర్చేందుకు... భారత హాకీ జట్టుకు సువర్ణ అవకాశం లభించింది. విశ్వ క్రీడల్లో(Paris 2024 Olympics) భారత్‌-జర్మనీ(India vs Germany) మధ్య నేడు కీలక సెమీస్‌ జరగనుంది. ప్రపంచ ఛాంపియన్‌ అయిన జర్మనీ ఓ పక్క...... ఆత్మ విశ్వాసంతో ఉన్న భారత్‌ మరోపక్క సమరానికి సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో ఈ రెండు జట్ల మధ్య హోరాహోరీ మాత్రం ఖాయం. 1980లో చివరి విశ్వ క్రీడల్లో ఫైనల్‌ చేరిన భారత హాకీ జట్టు... గత 44 ఏళ్లలో ఒక్కసారి కూడా ఒలింపిక్స్‌లో తుదిపోరుకు అర్హత సాధించలేదు. ఇప్పుడు కొత్త చరిత్ర లిఖించేందుకు సమయం ఆసన్నమైంది. ముందు సువర్ణ అవకాశం వేచి చూస్తోంది. ఇప్పటివరకూ అద్భుత ఆటతీరుతో సెమీస్‌కు దూసుకొచ్చిన భారత జట్టు.. ఇక ఈ మ్యాచ్‌లోనూ అదే అద్భుతాన్ని పునరావృతం చేస్తే ఫైనల్‌ చేరడం పెద్ద విషయమేమీ కాదు. 


 

ఆత్మ విశ్వాసంతో భారత్‌

గత వైభవాన్ని తిరిగి తీసుకురావాలన్న సంకల్పంతో ఉన్న భారత హాకీ జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. విశ్వ క్రీడల్లో వరుసగా రెండో పతకంపై కన్నేసిన భారత హాకీ జట్టు.. సెమీఫైనల్లో పటిష్టమైన జర్మనీతో నేడు తలపడనుంది. బ్రిటన్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో.. పది మందితోనే 48 నిమిషాల పాటు పోరాడి.. షూటౌట్‌లో బ్రిటన్‌ను ఓడించిన హర్మన్‌ ప్రీత్‌ సేన నేడు కూడా అద్భుతం చేసి ఫైనల్‌కు చేరాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ ఒలింపిక్స్‌లో 52 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించడం.... క్వార్టర్‌ ఫైనల్లో బ్రిటన్‌ను పది మందితోనే ఆడి మట్టికరిపించడం... భారత హాకీ జట్టులో ఆత్మ విశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. ఈ ఒక్క విజయం సాధిస్తే భారత్‌ ఖాతాలో వరుసగా రెండో ఒలింపిక్స్‌ పతకం కూడా చేరుతుంది. ఈ మ్యాచ్‌లో జర్మనీపై భారత జట్టు విజయం సాధిస్తే కనీసం రజత పతకం మన ఖాతాలో చేరుతుంది. కానీ ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న జర్మనీని అయిదో ర్యాంకులో ఉన్న భారత్‌ ఓడించడడం అంత తేలికైన పని మాత్రం కాదు. అయితే 2020 టోక్యో ఒలింపిక్స్‌లో జర్మనీపై గెలిచే భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ ఏడాది జూన్‌లో FIH ప్రో లీగ్‌లోనూ జర్మనీని భారత్‌ 3-0తో ఓడించింది. ఈసారి కూడా  అదే జర్మనీపై విజయం సాధించి ఇండియా మెన్స్‌ హాకీ టీం కనీసం రజత పతకం ఖాయం చేసుకోవాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. 

 

శ్రీజేష్‌ అనుభవమే వరం

క్వార్టర్ ఫైనల్‌ మ్యాచ్‌లో గోల్‌ పోస్ట్‌ ముందు కంచుకోటను నిర్మించి బ్రిటన్‌ దాడులను పదేపదే అడ్డుకున్న శ్రీజేష్‌(PR Sreejesh) అనుభవం ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది. తన కెరీర్‌లో చివరి టోర్నమెంట్‌ ఆడుతున్న శ్రీజేష్‌... భారత్‌ను ఫైనల్‌కు చేర్చాలన్న పట్టుదలతో ఉన్నాడు. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌(Harmanpreet Singh) కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. భారత డిఫెన్స్‌ చాలా బలంగా ఉంది. క్వార్టర్‌ ఫైనల్లో పది మందితోనే ఆడినా గోల్‌ పోస్ట్‌పై బ్రిటన్‌ దాడులను మన డిఫెండర్లు పటిష్టంగా అడ్డుకున్నారు. ఈ మ్యాచ్‌లో సమన్వయంతో రాణిస్తే విజయం భారత వశం కావడం తథ్యం.