Sen loses bronze to Malaysian shuttler, records 'best-ever finish': లక్ష్యసేన్ పోరాడాడు. అవును లక్ష్యసేన్ గొప్పగా పోరాడాడు. కుడి మోచేయికి గాయం వేధిస్తున్నా కాంస్య పతక పోరులో గెలుపు కోసం చివరి వరకూ పోరాడాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌కు పతకం రాకపోయినా లక్ష్యసేన్ పోరాటం మాత్రం ఆకట్టుకుంది. కాంస్య పతక పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్... మలేషియాకు చెందిన లీ జి జియా చేతిరో పోరాడి ఓడిపోయాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉన్న లీ జి జియాపై 22వ స్థానంలో ఉన్న లక్ష్య సేన్ తొలి సెట్‌ను గెలిచాడు. కానీ రెండో సెట్ నుంచి పుంజుకున్న లీ జిజియా మిగిలిన రెండు సెట్లు గెలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తొలి సెట్‌లో ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన లక్ష్యసేన్... సునాయసంగానే ఆ సెట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో పుంజుకున్న లీ జిజియా ఆ సెట్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరి మధ్య ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఇద్దరి మధ్య అయిదు మ్యాచ్‌లు జరగగా... లీ జిజియా నాలుగు, లక్ష్య ఒక మ్యాచ్ గెలిచారు. ఇవాళ కూడా లీ జిజియా ఆధిపత్యమే కొనసాగింది. ఈ మ్యాచ్ సందర్భంగా పలుసార్లు లక్ష్యసేన్ మోచేయికి చికిత్స తీసుకుంటూ కనపించాడు. నొప్పి వేధిస్తున్నా అద్భుతంగా పోరాడిన లక్ష్యసేన్... క్రీడాభిమానుల మనసులు గెలుచుకున్నాడు.
నొప్పి మెలిపెడుతున్నా..
కాంస్య పతక పోరులో లక్ష్య సేన్ 21-13, 16-21, 11-21తో మలేషియాకు చెందిన లీ జియా చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి సెట్‌లో లక్ష్యసేన్ ఛాంపియన్ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన లక్ష్య.... జిజియా తేరుకునే సరికే మంచి ఆధిక్యం సాధించాడు. ఆ తర్వాత సెట్‌ను 21-13తో గెలుచుకుని శుభారంభం చేశాడు. అయితే ఆ తర్వాత జిజియా తన అనుభవాన్ని ఉపయోగించి పుంజుకున్నాడు. ఆరంభం నుంచే స్మాష్‌లు, డ్రాప్‌లతో లక్ష్యపై ఆధిక్యం సాధించాడు. లక్ష్యసేన్‌ను గాయం కూడా ఇబ్బంది పెట్టింది. రెండో సెట్‌లో వరుసగా పది పాయింట్లు సాధించిన లీ జిజియా.. రెండో సెట్‌ను గెలుచుకున్నాడు. రెండో సెట్‌లో కాస్త గట్టిగానే పోరాడిన లక్ష్య.. మూడో సెట్‌లో మాత్రం చేతులెత్తేశాడు. దీంతో 21-13, 16-21, 11-21తో భారత పతకం చేజారింది.
షూటింగ్‌లోనూ నిరాశే...
షూటింగ్‌లోనూ భారత్‌కు నిరాశే మిగిలింది. కాంస్య పతక పోరుకు ఆశలు రేపిన మహేశ్వరి చౌహా న్-అనంత్ జిత్ సింగ్ ద్వయం పోరాడి ఓడిపోయింది. స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరు భారత షూటర్లు మహేశ్వరి చౌహాన్, అనంత్‌జిత్ సింగ్ ద్వయం 43-44 చైనా జోడీ జియాంగ్, జియాన్లిన్ చేతిలో ఓడిపోయింది. వరుసగా రెండు కాంస్య పతక పోరుల్లో భారత్ ఓడిపోవడం అభిమానులను బాధించింది.