Novak Djokovic, Carlos Alcaraz cry after Olympics final: ఓవైపు ఆనంద బాష్పాలు... మరోవైపు ఓటమి రోదనలు... ఓవైపు అంబరాన్నంటిన సంబరాలు... మరోవైపు పోరాడినా ఓటమి తప్పలేదని దిగులు.. కుటుంబ సభ్యులు, అభిమానులు " నువ్వు సాధించేశావ్ " అన్న పొగడ్తలు... మరోవైపు నువ్వు " గొప్పగా పోరాడావ్ " అన్న ఓదార్పులు.. ఈ ఘటనలన్నింటికీ పారిస్ ఒలింపిక్స్ మెన్స్ సింగిల్స్ ఫైనల్ వేదికగా మారింది. పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్రలో గుర్తుండిపోయే మ్యాచ్ జరిగింది. మెన్స్ టెన్నిస్ సింగిల్స్ ఫైనల్లో జకోవిచ్( Novak Djokovic).. అల్కరాజ్ హోరాహోరీగా తలపడ్డారు. రెండు కొదమ సింహాలు తలపడితే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్‌తో అభిమానులు మరోసారి చూశారు.
వరుస సెట్లలో జకోవిచ్ గెలిచినా.. అల్కరాజ్(Carlos Alcaraz) పోరాటం మాత్రం చిరకాలం గుర్తుండిపోతుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ స్వర్ణం గెలిచిన అనంతరం జకో బిగ్గరగా ఏడుస్తూ భావోద్వేగానికి గురికాగా.. ఓడిపోయిన అనంతరం అల్కరాజ్ కోర్టులోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మొత్తానికి 2 గంటల 50 నిమిషాల పాటు హోరాహోరిగా సాగిన ఈ మ్యాచ్ మాత్రం అభిమానుల మదిలో చాలా రోజులు గుర్తుండిపోతుంది.
కల నెరవేరిందిగా...
జకోవిచ్ ప్రపంచ టెన్నిస్ చరిత్రలో దిగ్గజ ఆటగాడు. ఎన్నో టైటిళ్లను సాధించి దిగ్గజ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్స్‌తో చరిత్ర సృష్టించాడు. టెన్నిస్ కోర్టులో ఎన్నో విజయాలను పాదాక్రాంతం చేసుకున్నాడు. ఇంక అతను సాధించాల్సినది ఏదైనా ఉందంటే అది ఒలింపిక్ స్వర్ణ పతకం ఒక్కటే. అందుకే తనకు అందకుండా సుదీర్ఘ కాలంగా వేచిచూసేలా చేసిన ఒలింపిక్ స్వర్ణాన్ని అందుకున్న అనంతరం జకో ఆనందం పట్టలేకపోయాడు. 2008 బీజింగ్ విశ్వ క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న జకోవిచ్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పసిడిని ముద్దాడాడు. దాదాపు దశాబ్దంన్నరగా తనను వేధిస్తున్న పతకాన్ని అందుకున్న వెంటనే జకో ఇక సాధించేశానో అన్నట్లు సైగ చేశాడు. తొలిసారి ఒలింపిక్స్ ఫైనల్ చేరిన జకోవిచ్..మట్టి కోర్టులో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కార్లోస్ అల్కరాజ్‌పై తన కెరీర్‌లోనే అద్భుత విజయం సాధించాడు. మ్యాచ్ తర్వాత, జొకోవిచ్ తన కుటుంబం వద్దకు పరిగెత్తాడు. తన కుటుంబ సభ్యులను హత్తుకుని బోరుమన్నాడు. భార్య జెలీనా, కుమార్తె తారాను గట్టిగా హగ్ చేసుకుని తాను సాధించేశానని చెపుతూ గట్టిగా ఏడ్చేశాడు. మ్యాచ్ సమయంలో జకొవిచ్ కుమార్తె తారా " మా నాన్న ఉత్తముడు " అంటూ ప్రదర్శించిన బ్యానర్ కూడా వైరల్‌గా మారింది.
అల్కరాజ్ కంటతడి
ఈ మ్యాచ్‌లో చివరి వరకూ అద్భుతంగా పోరాడినా అల్కరాజ్‌కు నిరాశ తప్పలేదు. వింబుల్డన్ ఫైనల్లో జకోవిచ్‌ను ఓడించిన అల్కరాజ్ ఒలింపిక్స్ ఫైనల్లో మాత్రం జొకో పట్టుదల ముందు తలవంచక తప్పలేదు. తొలి ఒలింపిక్స్‌లోనే బంగారు పతకాన్ని ముద్దాడాలనుకున్న కల చెదరడంతో అల్కరాజ్ కంటతడి పెట్టాడు. అయినా తన స్పోర్ట్స్ స్పిరిట్ చూపించాడు అల్కరాజ్. బంగారు పతక విజేత జకోవిచ్ కు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పాడు